ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఓ శుభవార్త అందింది. గాయం కారణంగా కెప్టెన్సీకి దూరమైన సంజూ శాంసన్ తిరిగి ఆ జట్టుకు సారథిగా వ్యవహరించేందుకు మార్గం సుగమమైంది. ఈ టోర్నమెంట్‌లో రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచులకు యువ క్రికెటర్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. అయితే ఈ మూడింటిలో రెండు మ్యాచుల్లో రాయల్స్ జట్టు ఓటమి పాలైంది. అయితే ఆ రెండు మ్యాచుల్లో ఓటమికి అనుభవం లేని పరాగ్ కెప్టెన్సీనే కారణమని కూడా కొందరు అంచనా వేశారు.
అయితే ఇప్పుడు సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌సెస్ సాధించడంతో ఏప్రిల్ 5న ఛండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను జట్టుకు సారథ్యం వహించనున్నాడు. చేతి వేలు ఫ్రాక్చర్ కారణంగా సంజూ మూడు మ్యాచ్‌ల కెప్టెన్సీకి వికెట్ కీపింగ్‌కి దూరమై కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అలా కూడా తన బ్యాటింగ్‌తో ఫర్వాలేదు అనిపించాడు. అయితే ఇప్పుడు సంజూకి బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో నాలుగో మ్యాచ్‌లో అతను పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండటంతో రాజస్థాన్ రాయల్స్ ఫేట్ ఎలా మారుతుందో చూడాలని అభిమానులు భావిస్తున్నారు.