Thursday, November 14, 2024

‘కొంత జీవహింస, కొన్ని జూదాలు

- Advertisement -
- Advertisement -

Sankranthi celebrations in Telugu states

 

ప్రతి సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుండీ జనవరి నెల వచ్చిందంటే, ఆ నెల రెండో వారం చివర్లో వచ్చే మకర ‘సంక్రాంతి’ దగ్గరపడే కొద్దీ ‘ఆంధ్రా’లో ఎంతో సందడి మొదలవుతుంది. ప్రధానంగా ఆంధ్రా రాష్ట్రంలోనూ, దానితో పాటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ, యానాం లోనూ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల వరకు పరచుకున్న తెలుగు ప్రాంతాల్లో కూడా సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు భోగి, మకర ‘సంక్రాంతి’, కనుమ, ముక్కనుమ పండుగలుగా తెలుగు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు.

వ్యవసాయం ప్రధానమైన జీవన విధానంగా జీవించే తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను జాతి, కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా జరుపుకోవటం ఒక ముఖ్య విశేషం. ముఖ్యంగా భీమవరం కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, ప్రముఖంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సంక్రాంతి పండుగ నాలుగు రోజులూ ఒక ‘తీర్ధ’యాత్రల్లాగా, జాతరలా, తిరునాళ్లలాగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మా భీమవరం ప్రజలకు సంక్రాంతిని మించిన పండగ మరోటి లేదంటే అతిశయోక్తి కాదు! ఇక సంక్రాంతి వస్తుందంటే ‘కోడి పందేల’ సందడి కూడా అంతా-ఇంతా కాదు. దానితోపాటే జంతు ప్రేమికుల ఆందోళనలు, జీవహింస గురించి చింతనలు, పోలీస్ హెచ్చరికలు, న్యాయస్థానాల తీర్పులు, రాజకీయ నాయకుల ప్రకటనలు అంతా కోడి పందేల చుట్టూనే కొంత కాలం తిరుగుతాయి. ప్రతిసంవత్సరం ఈ డ్రామా ఒక ధారావాహిక కార్యక్రమం లాగా సంక్రాంతి మొదలయ్యే వరకు జీళ్ళ పాకం లాగా సాగుతుంది… మళ్ళీ షరా మామూలే… సంక్రాంతి వస్తుంది… వెళ్తుంది… కోడి పందాలు ఖచ్చితంగా జరుగుతాయి.

నెగ్గిన కోళ్ళనూ, ఓడిన కోళ్ళనూ కూడా కలిపి కూర వండుకొని లేదా కోడి పకోడీలు వేసుకొని తినేస్తారు… కోడి పందేల చాటునే జూదాలు, పేకాట కూడా నిరాటంకంగా జరుగుతాయి… మధ్యలో కొందరు రాజకీయ నాయకులూ, ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్టుమెంట్ వాళ్ళు మాత్రం మంచిగా సంపాదించుకొంటారు… కొందరు నెగ్గుతారు… ఎంతోమంది ఓడిపోతారు… నెగ్గిన వాళ్ళూ, ఓడిన వాళ్ళూ కూడా మళ్ళీ కామన్ గా కోడి కూర లేదా కోడి పకోడీలు కలిపి మందులో మంచింగ్ గా తినేస్తారు… మరికొన్ని కోళ్ళూ – కోడి పకోడీలు మధ్యలో వాళ్ళకు వాటాగా వెళ్తాయి…

కోడి పందేలల్లో పాల్గొనే కోళ్లనే కాదు… అల్లుళ్ళ పేరు చెప్పి కొన్ని లక్షల కోళ్లను, కొడుకుల పేరు చెప్పి మరి కొన్ని లక్షల కోళ్లను, బంధువుల/స్నేహితుల పేరు చెప్పి ఇంకొన్ని లక్షల కోళ్లను కూడా నిరాటంకంగా కోడి కూర లేదా కోడి పకోడీలు చేసుకొని అందరూ కడుపు నిండా తినేస్తారు. ఇవన్నీ ఇంత వివరంగా ఎందుకు చెపుతున్నానంటే… కోడి పందేలకు జీవ హింసకూ ఎటువంటి సంబంధం లేదు… ఉండదు… ఉండబోదు… కోళ్లను ఎలాగైనా చంపుతారు… మంచిగా కూర వండుకొని గానీ లేదా వేయించుకొని మందులో మంచింగ్ గా గానీ తింటారు…

కోళ్లను తినటం మాత్రం కామన్, కంపల్సరీ… జూదం / పేకాట కూడా నిరాటంకంగా జరుగుతూనే ఉంటాయి… మధ్యలో కొందరు రాజకీయ నాయకులూ, ప్రభుత్వ అధికారులు, పోలీసులు పేకాట/ జూదం అదుపు చేస్తున్నామనే పేరు చెప్పుకొని మంచిగా సంపాదించుకొంటారు… దీనికి ఇంత నిషేధాలు అవసరమా అనిపిస్తుంది!…

కోడి పందేలు మన సంస్కృతీలో ఒక భాగమైపోయాయి… వాటిని నిషేధించడం సబబు కాదు… కోడి పందేల చాటున జరిగే జూదాన్ని కంట్రోల్ చేయటం అవసరమే కానీ, కోడి పందేలను నిషేధించడం కొందరికి ఆదాయ వనరుగా మారింది తప్ప జరిగేదేదీ ఆగటం లేదు. ప్రభుత్వాల అసమర్ధతను ప్రజల సంస్కృతీ,- సంప్రదాయాల మీద బలవంతం గా రుద్దటం తప్పు. కాకి, డేగ, నెమలి, గద్ద వంటి విచిత్రమైన పక్షి పేర్లతో కోడి పుంజుల్ని సంవత్సరాల తరబడి బాదం, పిస్తా, జీడీ పప్పులతో వ్యాయామాలు చేయిస్తూ మరీ, చాలా జాగ్రత్తగా పెంచి- పోషించి పందేలకు సిద్ధం చేస్తారు. కొన్ని లక్షల మంది కోడి పందేలు చూసి ఆనందిస్తారు. నిజానికి కోడి పందెం జూదగాళ్లు వందల్లో పేకాట ఆడేవాళ్లు మహా అయితే వేలల్లో మాత్రమే వుంటారు. వీళ్లపై సరైన నిఘా పెట్టి చాలా వరకు జూదాన్ని కంట్రోల్ చేయవచ్చు.

మనం రోజూ నిజజీవితంలోనూ, సినిమాల్లోనూ, టివిల్లోనూ, సోషల్ మీడియా- మొబైల్లోనూ చూసే ఘోరమైన హింసతో పోలిస్తే కోళ్ల పందేల జీవహింస ఏ రకంగాను హింస కాదు… అలా అని జూదాన్ని సమర్ధించడం అనుకోవద్దు… ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయిన, సంవత్సరానికి ఒక్కసారి జరిగే పండుగ సంస్కృతిని సంస్కరించాల్సిన అవసరం ఐయితే ఉంది. కోడి పందేలు కూడా ఒక ముఖ్యమైన జీవిత సందేశాన్ని ఇస్తాయి… అదేంటంటే… జీవితంలో యుద్ధంతో ఎవ్వరూ ఏమీ సాధించలేరు అని… కోడి పందెం ఒక రకమైన యుద్ధమే, రెండు కోళ్ళకు… ఓడిపోయిన కోడి వెంటనే లేదా కొంచెం సేపట్లోనే చనిపోతుంది… నెగ్గిన కోడి కూడా చాలా సార్లు కొంచెం తర్వాత చనిపోతుంది… కొంచెం ముందు, కొంచెం వెనుక అంతే…

జీవితం క్షణికం… జీవితం క్షణభంగురం… జీవితం స్వల్పం… కోడి పందెం లాగే… తొందర్లోనే ముగిసిపోతుంది… యుద్ధం కూడా అంతే… ఎవ్వరూ విజేతలు కాలేరు… విజేత అయినా క్షణికమే… తాత్కాలికమే… యుద్ధంతో వచ్చేది మరణం తప్ప జయం కాదు… ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి… కోడి పందెం ద్వారా కూడా ఒక నిజం తెలుసుకోవచ్చు…! అందరికీ ముందస్తు భోగి, మకర ‘సంక్రాంతి’, కనుమ, ముక్కనుమ పండుగ శుభాకాంక్షలతో…

 

                                                                                     పెన్మెత్స అశోక వర్మ
                                                                                    సీనియర్ జనరల్ మేనేజర్
                                                                               యశోద హాస్పిటల్స్ గ్రూప్స్, హైదరాబాద్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News