Tuesday, December 3, 2024

సకల సంతోషాల సంక్రాంతి

- Advertisement -
- Advertisement -

Sankranthi telugu chitra

 

సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ.  రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి.  అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు.  పంటలు పండటానికి కారణమై తమకు జీవనాధారమైన పశువులను కనుము పండుగ పేరుతో,  గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మి రూపంగా పూజిస్తారు.

తెలుగు ప్రజలకు సంక్రాంతి ప్రీతికరమైన పండుగ. సంవత్సరకాలంలో సూర్యుడు 12 రాశులలో నెలకు ఒక రాశి చొప్పున సంచరిస్తాడని ఖగోళశాస్త్రం చెబుతోంది. ఇలా సంచరించే సమయాన సూర్యుడు ఆంగ్ల సంవత్సరం జనవరి వచ్చేసరికి ధనూ రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. ఇది పవిత్రమైన కాలంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే మనకున్న రెండు అయనాల్లో సూర్యుడు దక్షిణాయన కాలం ముగించుకొని ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఇది సంక్రాంతి రోజునే ప్రారంభమౌతుంది. కనుక ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అని పెద్దలు నిర్ణయించారు. అందుకనే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్యపైన్నే ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే నిర్యాణం చెంది కైవల్యప్రాప్తిని పొందాడని చెబుతారు.

Sankranthi telugu chitra

బలరామ, కృష్ణుల స్ఫూర్తితో :

ద్వాపర యుగంలో బలరామ శ్రీకృష్ణభగవానులు భరతఖండాన్ని పాడిపంటలతో సుసంపన్నం చేశారు. బలరాముడు హాలికుడై నేలతల్లిని సస్యశామలం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తే, శ్రీకృష్ణుడు గోపాలుడై గో సంతతిని అభివృద్ధి పరచి ఏరువాకకు దోహదపడ్డాడు. అలాగే పాలు, పెరుగు, వెన్న (పాడి) ఉత్పత్తులతోను ప్రోత్సహించాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న పశువులను ప్రజల జీవితాలలో ఎంతగానో అనుబంధం చేశాడు. ఆ స్ఫూర్తి నుంచే వ్యవసాయ ఉత్పత్తుల పండుగగా సంక్రాంతి ఆవిర్భవించినట్లు పౌరాణికులు చెబుతారు.

ఆదిశంకరుల పునరుద్ధరణలో…

వేదాలు, స్మృతులు ఆదిశంకరాచార్య భగవత్‌పాదుల వారు పునరుద్ధరించడం వల్ల “సంక్రాంతి” పండుగ జరుపుకునే ఆచారం వచ్చిందని అంటారు. ఈ క్రమంలోనే “శ్రీరామనవమి”, శ్రీ కృష్ణాష్టమి పండుగలను కూడా తీసుకొచ్చారని అంటారు. ఆ కాలంలో నర బలులు, జంతు బలులు విపరీతమై, పూజా విధానంలో హింస, రక్తపాతం చోటు చేసుకున్నందున, ఇది దైవ వ్యతిరేక కార్యంగా గుర్తించి శంకరాచార్యులవారు తంత్రవిద్యల్లో నరబలిని, జంతు బలులను మాన్పించడానికి యత్నించాడు.

Sankranthi telugu chitra

కొబ్బరి కాయలతో పూజావిధానం :

బలుల స్థానంలో కొబ్బరికాయ కొట్టడాన్ని ప్రవేశపెట్టి అహింసాయుత పూజావిధానాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించి బలులను మాన్పించాడు. ఆ కొబ్బరికాయకు అంత పవిత్ర నేపథ్యం. వినాయకుడి కోసం శివుడు కొబ్బరికాయను సృష్టించినందున కొబ్బరికాయపై శివ, కేశవులు ప్రీతిపాత్రమైనందున కొబ్బరికాయ ప్రధాన పూజాద్రవ్యంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే సంక్రాంతి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి తదితర పండుగలతోపాటు దైవ పూజలలో కొబ్బరికాయ కొట్టించి దైవకృపకు భక్తులను పాత్రులను చేశాడు. అలాగే “సంక్రాంతి” అంటే “సంక్రమణం”, క్రాంతి అంటే వెలుగు, సంక్రాంతి అంటే కొత్త వెలుగు అనే అర్థాలతో మన పూర్వీకులు సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టతను, ఘనతను చేకూర్చారు.

sankranti

సంక్రాంతి పండుగ క్రమం :

సంక్రాంతి పండుగ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది రంగవల్లుల ముత్యాల ముగ్గులు. హరిదాసుల కృష్ణార్పణం సంకీర్తనలు. ఈ పండుగను పెద్దపండుగ అని కూడా అంటారు. ఇది పుష్యమాసం(జనవరి)లో వస్తుంది. ఈ సమయంలో రైతులు ఇళ్లకు ధన, ధన్యరాశులు చేరుతాయి. ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో ఉంటారు. ఈ సమయంలో వచ్చే సంక్రాంతి పండుగను వరుసగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటిరోజు “కామభోగి”, రెండోరోజు “సంక్రాంతి”, మూడోరోజు “కనుమ” (పశువుల పండుగ), కొందరు నాలుగోరోజును “ముక్కనుము”గా జరుపుకుంటారు. ఈ సమయంలో పౌష్యలక్ష్మీతో కళకళలాడే గృహప్రాంగణాలతో ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.

Sankranthi telugu chitra

మొదటిరోజు భోగి :

గ్రామాల్లో తెల్లవారుజామునే నాలుగు రోడ్లకూడలిలో భోగిమంటలు వేస్తారు. గ్రామ, ఇంటి అరిష్టాలు, రోగ, పీడలు తొలిగిపోవడానికి మంటలను కాస్తారు. అలాగే ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయడం, దిష్టి తీయడం వంటి ఆచారాలు చేస్తారు.

Sankranthi telugu chitra

రెండో రోజు సంక్రాంతి

గోగులు పూచే గోగులు పూచే ఓ లత్తాగుమ్మాడి వంటి మనసుకు హత్తుకునే జానపద గీతాలు ఆలాపనలు, కేరింతలు, సవ్వడులు వినిపించే తెలుగువారి పండుగ సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇళ్లలో ఉన్న పంటల ధాన్యరాసులను చూసుకొని రైతులు మురిసిపోతుంటారు. సనాతన సంస్కృతిలో సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. నెల రోజుల నుంచే ఈ పండుగ హడావుడి మొదలవుతుంది. దీన్ని నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పట్టిన దగ్గర్నుంచి అంటే డిసెంబర్ 14, 15వ తేదీ దగ్గర నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో రంగవల్లులు, పండుగ సందడి ఊపందుకుంటుంది. గృహలక్షులు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిళ్లను శుభ్రంగా ఊడ్చి, కళ్లాపి జల్లి ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. ఇక హరిదాసుల నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్తాయి. గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్ముదాసరులు, జంగమదేవరలు, బుడబుక్కల వారు తమ కళా

రూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన అలరిస్తూ శోభాయమానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. ఎడ్ల పందాలు, బరువులాగుడు పందాలు, కోడి పందాలు, కబడ్డీ క్రీడలు, పతంగులు ఎగరేయడాలు, పేకాట గుండాటలతో గ్రామాలను సంబరాల్లో ముంచెత్తుతారు.

ప్రతీ ఇంటి ముంగిట విభిన్న రీతుల్లో పెట్టిన ముగ్గుల మధ్యలో గొబ్బిళ్లను అలంకరిస్తారు. వాటిని ఆవుపేడతో చేసి వాటిపై గుమ్మడి, బంతి, చేమంతి తంగేడు వంటి పూలను ఉంచి అలాగే నవ ధాన్యాలను పోసి పూజలు చేస్తారు. నెలరోజులపాటు ఇంటి ముందు వేసే ముగ్గుల్లో చివరి రోజు “ రథం ముగ్గు” వేస్తారు. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభను విరాజింపజేస్తాయి. ఈ కాలంలోనే అంటే హేమంత రుతువులో గొబ్బిపువ్వులు (డిసెంబర్ పువ్వులు), చేమంతులు, బంతి పువ్వులు విరివిరిగా పూస్తాయి. మామిడి చెట్లు పూతమీదుంటాయి. కనుకనే సంక్రాంతికి ఏ ఇంట చూసినా మామిడి తోరణాలు కాకుండా బంతిపూవుల తోరణాలు కనబడతాయి. పూతమీదున్న మామిడి కొమ్మలు విరువరు కాబట్టి సంక్రాంతికి తమ ఇళ్లలో గృహాలక్ష్మిలు చేసిన రుచికరమైన పిండి వంటకాలు పొంగళ్లు తింటారు.
Sankranthi telugu chitra

కనుము పండుగ

కనుము పండుగను మూడోరోజు జరుపుకుంటారు. కనుము అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు. హిందువుల సనాతన ధర్మంలో గోవులను ( గోమాతలను) పూజిస్తున్న నేపథ్యంలో ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఆచారం. ఈ నేపథ్యంలో కనుము రోజు పశువులు ఉండే పాకలను శుభ్రం చేస్తారు. పశువులను గ్రామంలోని చెరువులో శుభ్రంగా కడుగుతారు.
( స్నానం చేయిస్తారు ) అనంతరం వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి, నొసట బొట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు.
సినిమాలు
ఏ పండుగపై రాని సినిమాలు సంక్రాంతి పండుగ పేరుతో అనేకం వచ్చాయి. ఊరంతా సంక్రాంతి, ఉండమ్మా బొట్టు పెడతా, ముత్యాలముగ్గు, రైతు కుటుంబం, మంచి రోజులు వచ్చాయి, భోగిమంటలు, సంక్రాంతి తదితర సినిమాలు పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.

వివిధ పోటీలు
దివిసీమ సంప్రదాయ పడవల పోటీలు, కనోయింగ్, కాయ్‌కింగ్ తదితర ప్రదర్శనలు, డ్రాగన్ బోట్ రేస్‌లు అన్ని ఏర్పాట్లతో నిర్వహిస్తారు. నదిలో తేలియాడుతూ నాగాయలంక వాసులు శవాసనాలు వేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సంప్రదాయలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం.

పిండి వంటలు

సకినాలు, చెగోడీలు, అరిసెలు, నువ్వుల గారెలు తదితర పిండివంటకాలు చేస్తారు. వంటకాల్లో నువ్వులు ఎక్కువగా వాడతారు. నువ్వుల పులగం ( పాయసం) చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెట్టి అనంతరం ఆరగిస్తారు.

పలు రాష్ట్రాల్లో  వివిధ పేర్లతో..

* కేరళ: శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఉన్న పొన్నంబలమేడు కొండమీద మకర సంక్రాంతి రోజున అయ్యప్పస్వామిని మకర జ్యోతి రూపంలో సందర్శించుకుని భక్తులు స్వయంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లుగా దివ్యానుభూతి పొందుతూ తరిస్తారు.
* గుజరాత్ : సిదా… మనానా, వాసి ఉత్తరాయణం పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సోదరుడు తన అక్కా, చెల్లెళ్లను పిలిచి కొత్త వస్త్రాలను బహుకరిస్తాడు. ఈ సంప్రదాయాన్ని వాళ్లు సిదా అంటారు. మహిళలు అత్తామామలకు కానుకలు ఇవ్వడాన్ని మనానా అని పిలుస్తారు.

* పంజాబ్‌లో మకరసంక్రాంతిని మాంగి అని పిలుస్తారు.
* రాజస్థాన్‌లో భోజ్.
* తమిళనాడులో పొంగల్ ( ధామ్ మట్టు)గా అంటారు.
* అస్సాంలో మాగ్‌బిహు లేదా భోగాలి బిహు.
* మహారాష్ట్రలో పండుగ నాడు శరీరానికి నువ్వులనూనెను పట్టించి తలంటు స్నానం చేస్తారు.
* గోవాలో మహిళలు హల్దీ, కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
* సిమ్లాలో మకర సంక్రాంతిని మాఘసాజీ.
* ఉత్తర ప్రదేశ్‌లనో కిచెరి.
* ఒడిస్సాలో మకర చౌలా. పండుగనాడు కొణార్క్‌లోని ప్రసిద్ధ సూర్యదేవాలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
* బెంగాల్‌లో పౌష్ సంక్రాంతి.
* బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సాక్రాత్.
* అస్సాంలో సుగి లేదా రైతుల పండుగగా భావిస్తారు. పండుగనాడు ఆవులను అలంకరిస్తారు. ఈ పూజా విధానాన్ని “ కించుహయ్ శివుడు అని అంటారు.
* కుమావున్: ఈ ప్రాంతంలో మకర సంక్రాంతిని ఎక్కువగా జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో కొండప్రాంతాలకు వేలాది పక్షులు జోరుగా, హోరుగా వస్తాయి. కిలకిల రావాలతో ఎంతో సందడి చేస్తూ ఆ ప్రాంతానికి శోభను, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
* కత్తికోడి, పొట్టేళ్ల పందాలు:
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర (బొబ్బిలి సీమ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలతో కత్తికోడి, పొట్టేళ్ల పందేలతో ఎంతో సందడిగా, కోలాహలంగా ఉంటాయి. కోడి పందాల నిర్వాహణ 10 రోజుల ముందే మామిడి తోటలు, కొబ్బరితోటల్లో “బరువు” ఏర్పాటు చేస్తారు. లక్షలనుంచి కోటి రూపాయల వరకు పందేలు వేస్తారు.

తాళ్లపల్లి యాదగిరిగౌడ్,
99497 89939

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News