Wednesday, January 22, 2025

తెలుగు సంస్కృతి సంక్రాంతి

- Advertisement -
- Advertisement -

యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తున్న క్షీర ధార హైందవ సంస్కృతి. ఆ పాల వెల్లువలో పెల్లుబికిన మీగడ తరగలే మన సాంప్రదాయాలు. హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు ‘పండగ కేంద్ర బిందువు, పండుగలు శుభ సూచకాలు. ప్రతి కుటుంబంలో కష్టనష్టాలను మరపించి, నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. పండగలు పురాణేతిహాస, రుతు సంబంధాలు, శీతోష్ణ స్థితుల, సామాజిక జీవన విధానాధారాలుగా ఏర్పడ్డాయి. ప్రతి పండగలో పరమార్థం ఉన్నందునే అవి సాంప్రదాయాలుగా మారాయి. డోలు సన్నాయి వాద్యాలు, వాటి రాగాలకు అనుగుణంగా విన్యాసాలు చేసే అలంకృత గంగిరెద్దులు, హరిలో రంగ హరీ అంటూ, నడినెత్తి నుండి నాసిక దాకా తిరుమణి శ్రీచూర్ణ పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా, బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా, చిందులు తొక్కే హరిదాసులు, అడుగడుగునా ముంగిళ్లలో రంగుల ఆకృతులు, భోగి మంటలు, కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, బొమ్మల పండుగలతో కలబోసిన గ్రామీణ సుందర మనోహర దృశ్యాలు తెలుగు వారికే ప్రత్యేకమైన సాంప్రదాయ ప్రతీకలు.

చాంద్రమానం ‘పాటించే తెలుగువారు ‘సౌరమానం’ ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి’, ‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమ కేశు సంచరత: సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తర: రాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి’. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. కర్కాటకం నుంచి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభి ముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘దక్షిణాయణం’ అంటారు. మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తరాభి ముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని ‘ఉత్తరాయణం’ అని అంటారు. దేవతలకు ఉత్తరాయణం ఉత్తమ కాలమని, దక్షిణాయణం పితృదేవతలకు ముఖ్య కాలమని భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగు తుందంటారు. అందుకే అంపశయ్యపై భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచిఉన్నాడని మహాభారతం చెబుతోంది..

మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది భోగి పండగ. ఇతర పండుగల వలె తిథి ప్రధానము అయినది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు. మకర సంక్రమణానికి పూర్వపు రోజు. గోదాదేవి తిరుప్పావై రచన పూర్తి చేసిన ముప్పయవనాడు రంగనాథుడు ప్రత్యక్షమై ఆమెను వివాహమాడతానని, సకల భోగాలు సమకూరుస్తానని చెప్పి, వివాహమాడగా, వివాహతంతు పూర్తికాగానే ఆమె స్వామి వారిలో ఐక్యం పొందుతుంది. అందుకే ‘భోగి’ అని ఈ పర్వమానికి పేరు. జనసామాన్యానికి భోగ భాగ్యాలు ఇచ్చే రోజనీ ప్రతీతి. భోగినాడు మేఘాధిపతి యైన ఇంద్ర పూజు చేయడం ఆనవాయితీ. బలి చక్రవర్తి అణగిన దినంగా చెపుతారు.

భోగి నాడు భోగి పీడ నివారణ, తెల్లవారగనే అభ్యంగన స్నానం చేయడం, విధాయక కృత్యం. చంటి పిల్లలకు తలంటు పోసి, భోగి పళ్ళు పోయడంతో దృష్టి పరిహారం చేస్తారు. కొత్త బట్టలు కట్టి, కుర్చీలో కూర్చుండ చేసి, రేగుపళ్ళు, పైసలు, చెరుకు ముక్కలు, బోడికలు దిగువార బోస్తారు. ధనుర్మాసం నెల రోజులు ఆడపిల్లలు తయారు చేసిన గొబ్బిపిడకలు చేయడం, తెల్లవారగట్లు భోగి మంటలు చేయడం ఆచరిస్తారు. మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తర గతుడు కావడం ఉత్తరాయణ ప్రవేశమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు అర్హమైన కాలం, ఈ అయనంలో మృతి చెందిన వారు పుణ్యాత్ములై, సూర్య సాయుజ్యం పొందగలరని వేద వచనం. సూర్య సంచారమును బట్టి ఏర్పడిన పండుగ. ఆడపిల్లలు తెల్లవారు జామున లేచి పెట్టే గొబ్బిల్లు, ఆర్ష కర్మలలో ప్రాముఖ్యం కలిగిన కళాభిజ్ఞత ఉట్టిపడే ముగ్గులు, పళ్ళ నైవేద్యాలు, బాజా భజంత్రీల వాద్యాలు, ఎక్కడ చూసినా ఈనాడు దర్శనమిస్తాయి. రెండవ నాడు జరిపే మకర సంక్రాంతి అత్యంత పురాతనమైనది.

సంక్రాంతినాడు గంగలో స్నానం చేసి, బ్రాహ్మణునికి పెరుగు దానం చేయాలనే నియమాన్ని పాటించిన యశోదకు కృష్ణుడు జన్మించాడని దుర్వాసముని ద్వారా వివరింపబడి, ఆయన సూచనపై ద్రోణాచార్యుని సతి కృపి, సంక్రాంతి పర్వాన్ని జరిపి, పెరుగు దానం చేయడం ద్వారా అశ్వత్థామకు జన్మనిచ్చినట్లు పురాణ కథనం. ఈ సందర్భంగా నువ్వుల ముద్దలతో నలుగు పెట్టుకుని, తలంటి స్నానాలు చేసిన ముత్తయిదువలు, అలంకృతులై, ఐదు మట్టి ముంతలు పుచ్చుకుని, ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పు దినుసులు, చెరుకు, క్యాబేజీ ముక్కలు, రేగుపళ్ళు, నువ్వులు ఉంచి, మూకుడు మూతతో ఉంచి, ఎరిగిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఇస్తారు. నువ్వులతో చేసిన భక్ష్యాలతో భోజనం చేస్తారు. చిన్న పిల్లలకు మిఠాయి ఉండలు, రేగుపళ్ళు పంచుతారు. మకర సంక్రాంతినాడు రాముని పూజ చేసి ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు సూర్యుని ఆరాధించి, తిలలు, కూష్మాండాలు, భాండా లు, కంబళి, ధాన్యాలు, లోహాలు, వస్త్రాలు, తైల దీపాలను దానం చేయాలని శాస్త్ర వచనం. భోజనానికి బంధు మిత్రులను ఆహ్వానించడం, నగలతో అలంకరించుకుని సూతన వస్త్ర ధారణ గావించిన ముత్తయిదువలు పంచదారలో నువ్వులు కలిపి చిమ్మిలి చేసి, పంచి పెడతారు.

సంవత్సరం పొడువునా, స్నేహితులై ఉండాలని ఆకాంక్షిస్తూ, శుభ, సుఖప్రదం కావాలని దీవనలను పెద్దవారి నుండి పొందడం ఆచారం. ఇక చివరిది కనుము పండుగ. అధర్వణ వేదంలో దీనిని వ్యషభోత్సవమని పేర్కొన్నారు. ముందు సంక్రమణం పెళ్ళిన మరువాడు పశువులకు చేసే పండగ ఇది. కనుమనాడు మినుములు తినాలట.. కనుమనాడు మినుములు తినాలని లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడని పెద్దలు అంటారు.

కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు తమ గ్రామ దేవతలకు నైవేద్యాలను సమర్పించే ఆచారం ఉంది. పురుషులు గ్రామ పొలిమేరల్లో కోడి పందాలు, పొట్టేళ్ల పందేలు జరుపుతారు.. కనుమ రోజున ప్రయాణం పెట్టుకోకూడదని అంటారు. వెళ్తే వెంటనే తిరిగి రావడం కుదరదని ప్రతీతి. కనుమనాడు కాకి కూడా ఎక్కడకీ బయల్దేరదనే సామెత. కనుమునాడు గోపూజ చేయడం కొన్ని చోట్ల కనిపి స్తుంది. ఆవులను, దూడలను, ఎడ్లను, శుభ్రంగా కడిగి, కొమ్ములకు ముఖానికి పసుపు రాచి, కుంకుమ పెడతారు. అలంకరణార్థం కుచ్చులు, కొత్త కట్టు తాళ్ళు పెడతాడు. వీధుల వెంట ఊరేగిస్తారు. పశువుల శాలలను శుభ్రపరిచి మామిడాకులు కట్టి, పూలతో అలంకరిస్తారు. సాయం కాలం పొంగిలి నైవేద్యాన్ని పశువులశాల వద్ద పెడతాడు. పవిత్రోదకం చల్లుతారు. పంటలు పండించే భగవంతునికి పొలాలను దున్నే ఎద్దులకు కృతజ్ఞత తెలిపే పర్వం సంక్రాంతియనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు వారికి ఇష్టమైన సంక్రాంతి సంబరాలకు తెలుగు నేల సిద్ధమవుతున్నది.

ఆర్‌కె సంగనభట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News