‘పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని సన్నబియ్యంతో బువ్వ పెట్టే పథకంతో నిజం చేయాలన్నదే నా సంకల్పం. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకుంటా. వాటిలో కొన్ని సంక్షేమ పథకాలు చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోతాయి. ఆ కోవలోనిదే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సన్నబియ్య పథకం’
ఎక్స్‌లో సిఎం రేవంత్
ఇక నుంచి పేదలకు
శ్రీమంతులు తినే బియ్యం
ప్రభుత్వాలు మారినా ఈ
పథకం కొనసాగుతుంది
సన్నబియ్యం పంపిణీతో
దళారులు, మిల్లర్ల దందాకు
చెక్ రాష్ట్రంలో 3.10 కోట్ల
మందికి పంపిణీ గతంలో
ఏ ముఖ్యమంత్రికీ ఈ
ఆలోచన రాలేదు వరి వేస్తే
ఉరేనని రైతులను మాజీ
సిఎం బెదిరించారు పదేళ్లు
రాష్ట్రాన్ని పాలించిన
బిఆర్‌ఎస్ ఎస్‌ఎల్‌బిసిని
నిర్లక్షం చేసింది
ప్రజలు అండగా నిలబడితే
మరిన్ని సంక్షేమ పథకాలు
హుజూర్‌నగర్ సభలో
సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
సన్నబియ్యం పంపిణీ
పథకానికి ప్రారంభోత్సవం
హుజూర్‌నగర్‌కు అగ్రికల్చర్
కాలేజీ మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్/హుజూర్ నగర్: పేదలకు సన్నబియ్యం పథకం నిరంతరంగా కొనసాగుతుందని, ప్రభుత్వాలు మారినా సన్న బియ్యం పథకం ఎవ్వరూ ఆపలేరని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉగాది పండుగ పర్వదినాన హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అండగా నిలబడితే మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం నేటి నుంచి దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేదలు కూడా తినే రోజు లు వచ్చాయన్నారు. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని, ఉగాది రోజున సన్నబి య్యం పంపిణీని ప్రారంభించటం తనకెం తో సంతోషకరంగా ఉందని వెల్లడించారు. సాయుధ రైతాంగ పోరాటం, రోటీ కపడా ఔర్ మఖాన్, రెండు రూపాయల కిలో బియ్యం తర్వాత ఈ ప్రభుత్వం తెచ్చిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. సన్నబియ్యం ఆషామాషీ పథకం కాదు.
ఏ ముఖ్యమంత్రి వచ్చినా సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరు అని స్పష్టం చేశారు. పేదలకు 25 లక్షల ఎకరాలను అసైన్డ్ భూములుగా పంచిన చరిత్ర స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ సొంతమని, దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి తండాల్లో ఉండేదన్నారు. రూ.1.90కే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట ఆనాటి సిఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి భావించారని, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2లకు కిలో బియ్యం పథకాన్ని ఎన్.టి.రామారావు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం లో ఆనాడు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. పేదలకు ఆహారభద్రత కల్పించాలన్న లక్షంతో కాంగ్రెస్ పార్టీ 1957లోనే రేషన్ దుకాణాలను ప్రారంభించి బియ్యం ఇచ్చేందుకు నిర్ణయించిందని తెలిపారు.
నల్లగొండకు గొప్ప చరిత్ర ఉంది
దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే జిల్లాల్లో నల్లగొండ జిల్లా ప్రధానమని ముఖ్యమంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లా ప్రజలకు గొప్ప చరిత్ర ఉందని, నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లు స్వరాజ్యం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటాలు చేసిన గడ్డ ఇది అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది అన్నారు. క్రిష్ణపట్టి ప్రాంతం చైతన్యానికి మారు పేరు, హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కు కంచుకోట అని కార్యకర్తలు నిరూపించారు, రావి నారాయణరెడ్డి ని దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించిన గడ్డ నల్లగొండ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
ప్రజల ఆకాంక్ష మేరకే
రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వడ్లు పండిస్తున్నారని, గత ప్రభుత్వం మిల్లర్ల దగ్గర 21 వేల కోట్ల వడ్లను దాచి పెట్టిందని విమర్శించారు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని రూ.10లకు మిల్లర్లు కొని తిరిగి రూ.30లకు ప్రభుత్వానికే అమ్ముతున్నారు, దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేరు, దళారుల దోపిడి కి గురవుతున్నాయి, అందుకే ప్రతి పేదవాడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇవ్వాలని మంత్రి వర్గ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఆహార భద్రత సోనియమ్మ దయ
సోనియమ్మ అహార భద్రత చట్టాన్ని తెచ్చి పేదవాడి ఆకలి తీర్చిందని, అమ్మ పాత్ర ను సోనియమ్మ పోషించి అహారభద్రత చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివినోడు, తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినోడు సన్నబియ్యం ఇవ్వలేదు పైగా, వరి వేస్తే ఉరేనని రైతులను భయపట్టారని ఎద్దేవచేశారు. మాజీ ముఖ్యమంత్రి వరి వేయవద్దని, వస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పారు కానీ, తన ఎర్రవెల్లి ఫాం హౌస్ లో వెయ్యి ఎకరాల్లో వడ్లు పండించి క్వింటాల్ కు రూ.4,500లకు అమ్మాడు, దళితులు, గిరిజనులు వడ్లు పండిస్తే ఆనాడు కొనేవాడేలేడు కానీ, ఇప్పుడు పేదలు పండించిన ప్రతి గింజ ను మా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అంతే కాకుండా సన్న బియ్యం పండించిన రైతులకు క్వింటాల్ కు రూ.500లు బోనస్ కూడా ఇస్తున్నామని చెప్పారు.
దీంతో నల్లగొండ జిల్లా రైతులు అత్యధికంగా బోనస్ అందిందని చెప్పారు.హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమలదండు లా, కృష్ణానది ఉప్పొంగిందా అన్నట్లు హుజూర్ నగర్ సభకు జనం వచ్చారు, రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టులను తీసుకువచ్చాయి కానీ, పదేండ్లు పరిపాలించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్.ఎల్.బి.సి) సొరంగ పనులను పూర్తిగా నిర్లక్షంచేసి పక్కన పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 44 కిలోమీటర్ల సొరంగంలో 34 కిలోమీటర్లు పూర్తయిందని, నల్లగొండ ప్రజలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న కోపం కారణంగానే ఎస్‌ఎల్బీసీ సొరంగం విషయంలో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏది ఏమైనా అతి త్వరలో సొరంగం పూర్తి చేసి నల్లగొండ జిల్లా ప్రజలకు నీటిని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత పాలకులు తమ అవినీతి సంపాదన కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాస్తా కూళేశ్వరం అయిపోయిందని ఎద్దేవచేశారు. ఆ దెబ్బతో ప్రజలు ఇచ్చిన తీర్పునకు ఆపార్టీ అధినేత ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడని అన్నారు.
ప్రాజెక్టుల పూర్తికి మా సంకల్పం
పడాగపడిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, మూడేళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష కోట్లు మింగి కట్టిన కాళేశ్వరం కాస్తా కూళేశ్వరం అయ్యిందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు లేకున్నా దేశంలోనే అత్యధికంగా వడ్లను పండించిన రికార్డు తెలంగాణ రైతులదని ప్రశంసించారు. తన ఆలోచనలో లోపం లేదని, మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు సిఎం తెలిపారు.
వారి అణిచివేత సాగలేదు
నాడు అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసినా ప్రజల అండదండలతో తిరిగి ఎనిమిది నెలల్లో మల్కాజిగిరి లోక్ సభ స్థాని నుంచి ఎంపీగా ఎన్నికయ్యానని నాటి సంఘటనలను ప్రజలకు వివరించారు. 2006 లో జడ్పీటీసీ గా రాజకీయం మొదలు పెట్టిన తాను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో 2024 లో ముఖ్యమంత్రి అయ్యానని చెప్పారు. శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు గా ఈరోజు బిఆర్‌ఎస్ వాళ్ల పరిస్థితి ఉందన్నారు.
రైతుల గుండెల్లో నిలిచేలా&
రైతుల గుండెల్లో ఇందిరమ్మ, సోనియమ్మ పేరు నిలిచేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్నట్లు సిఎం తెలిపారు. ధాన్యాని కొన్న మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం, ఇప్పటికే రూ.5కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేశాం., మిగిలిన 4వేల కోట్ల త్వరలోనే వేస్తామని చెప్పారు. మూడు కోట్ల మందికి సన్న బియ్యం ఇచ్చి తీరుతాం ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
వ్యవసాయ కళాశాల మంజూరు
వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ ప్రాంతాలకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిర్యాలగూడ కు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో చేయగలిగిన కార్యక్రమాలన్నీ చేశాం, ఇంకా చేస్తామన్నారు. అయితే తమ కాళ్లలో కట్టెపెట్టి అడ్డుకోవాలని కొందరు చూస్తున్నరని, అలాంటి వాళ్ల కళ్లలో కారం కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది, తెలంగాణ ను దేశానికి నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
బడుగులకు ఆహార భద్రత లక్షం: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
అణగారిన బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని 85 శాతం మంది నిరుపేద రేషన్ కార్డుహోల్డర్లకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది రోజున ప్రారంభించామన్నారు. దేశంలో నే ఈ తరహా ప్రయోగం తొలిసారి తెలంగాణా రాష్ట్రం నుంచే ప్రారంభంకావడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. గతంలో రూ.10,665 కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసినా సంకల్పం నెరవేరలేకపోగా దొడ్డు బియ్యం దారి తప్పి కోళ్ల ఫారాలకు, బీర్ల కంపెనీ లకు చేరాయన్నారు. తమ ప్రభుత్వం పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిందని వివరించారు.
గత పాలకులకు ఎన్నికల సమయంలోనే తెల్ల రేషన్ కార్డులు గుర్తుకు వచ్చేవన్నారు. దీనిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల మంజూరికి నిర్ణయం తీసుకుందన్నారు. తద్వారా రేషన్ కార్డుల కోసం అదనంగా 30 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 2.85 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఆ సంఖ్యతో 3.10 కోట్లకు చేరనుందని తెలిపారు. ఉచితంగా సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా 85 శాతం మేరకు దాదాపు 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కార్ వేణుగోపాల్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీదర్ బాబు, అనసూయ సీతక్క, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లతో పాటు ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, మల్లు రవి, మందడి అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామేలు తదితరులు హాజరయ్యారు. బహిరంగసభ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రాధాన్యతను వివరించారు.