మహా కుంభమేళాలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. పూసలమ్ముకునే ఆ అమ్మాయి ఫొటోని కొంతమంది తీయగా ఆమె ఓవర్ నైట్‌లో పాపులర్ అయింది. ఆ అమ్మాయికి ‘కుంభమేళా మోనాలిసా’ అనే ట్యాగ్ లైన్ కూడా వచ్చేసింది. అంతేకాదు ఆ అమ్మాయి అందానికి ముగ్దుడైన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, ఆమెకు తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఆఫర్ చేశాడు. ఇలాంటివన్నీ సాధారణంగా ప్రకటనలకే పరిమితం అవుతాయని, కార్యరూపం దాల్చవని అంతా అనుకుంటారు.
కానీ మిశ్రా మాత్రం ఆ అమ్మాయిని వెతికి పట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్ అనే ఊరిలో ఉన్న మోనాలిసా ఇంటికెళ్లాడు. ఆమెను తన సినిమాలోకి తీసుకుంటున్నట్టు చెప్పాడు. అక్కడికక్కడే అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడు. అలా తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా.. మిశ్రా తీయబోయే ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చింది. మోనాలిసా చాలా అమాయకంగా ఉందని, ఆమెకు పూర్తిస్థాయిలో నటనలో శిక్షణనిచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపాడు మిశ్రా.