Monday, December 23, 2024

సంతాల్ సమరయోధులు

- Advertisement -
- Advertisement -

సిద్ధూ కాన్హూ ఇరువురు సంథాల్ తెగలో ముఖ్య పోరాట వీరులు. జార్ఖండ్‌లోని సాహెబ్ గంజ్ జిల్లాలో భోగనాడిహ్ అనే గ్రామంలో సిద్ధూ 1815లో, కన్హూ 1820లో జన్మించారు. సిద్ధూ కన్హూ ముర్ము సహోదరులు సంతాల్ పరగణాలో తొలి సమరయోధులు. సిద్ధూ ఆరడుగులు ఉండేవాడట. చిన్నప్పటి నుంచే చాలా బలవంతుడు. ఇతడి తండ్రి పేరు చున్ను మాంజి ముర్ము. సిద్ధూ, కాన్హూ, చాంద్, భైరవ్ వీరు నలుగురు అన్నదమ్ములు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఈ నలుగురూ సంయుక్తంగా పోరాడారు. సంతాల్ సమాజాన్ని ఏకతాటి మీదికి తెచ్చేందుకు సిద్ధూ, కాన్హూ తమ సంప్రదాయ పద్ధతులపై శక్తివంచన లేకుండా అవగాహన కలిగించేవారు.దుజియాబాబా ప్రవచనాల ప్రభావం వల్ల వీరికి భక్తిభావం కూడా పెరిగింది.

మారడ్ బురు, జోహార్ బరా అనే వారు తమకి దర్శనం ఇచ్చి తన రాజ్యాన్ని సుస్థిరం చేయమని ఆదేశించారని సిద్ధూ కన్హూలు ప్రకటించారు. అంతేకాదు తమ కులదేవత కూడా ఆంగ్లేయుల్ని నిర్మూలించాలని చెప్పిన విషయాన్ని సైతం ప్రచారం చేశారు. సాల వృక్షం దగ్గర చెవి పెట్టి వింటే అందరూ ఎలా సంఘటితం అవ్వాలో వినిపిస్తుందన్న రహస్యాన్ని అందరికీ చెప్పారు.తర్వాత ఆ సందేశాన్ని వాడవాడలా వ్యాపింప చేశారు.

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో జమీందారీ వ్యవస్థను రూపుమాపడానికి సంతాలుల తిరుగుబాటు ప్రారంభించబడింది. 1855, జూన్ 30న భోగనాడిహ్ గ్రామంలో ఒక పెద్ద సభ నిర్వహించారు. దానికి పది వేల మంది మాంఝీలు వచ్చారు. ఆ రోజుని ‘నీహుల్ దివస్’ అంటారు. ‘ఆంగ్లేయులారా! మా భూమిని వదలి పొండి’ అంటూ ఆ సభలో గట్టిగా నినాదాలు చేశారు. సిద్ధూని రాజుగా, కాన్హూ ను మంత్రిగా, చాంద్ ని ప్రకాశకుడుగా, భైరవ్‌ను సేనాధిపతిగా ఎన్నుకున్నారు. దాని తర్వాత పంచ్ కరియ అనే గ్రామం లో రెండవ సభ పెట్టారు. ఆ సభలో నలుగురైదుగురు జనంలో హత్య చేయబడ్డారు. అది జరిగిన తర్వాత అక్కడి జనాల్లో విప్లవ జ్వాల ఇంకా ప్రజ్వరిల్లింది. కానీ తగ్గలేదు. అరాచకాలు సృష్టిస్తున్న పరాయి పాలకులను తుద ముట్టించాలి అనేదే వారందరి అంతిమ లక్ష్యం.

ఈ ఆందోళనలో భాగస్థులు అయిన వారందరి మంచి చెడులు, రక్షణ వంటివి సిద్ధూ, కాన్హూ చూసుకునేవారు. వీరికి మద్దతుగా ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం చేయాలని, లేనియెడల వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని చెప్పారు. అలాంటి వారిని దోచుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అతడి అనుచరులు వుదకి పూర్ గ్రామంలో ఒకఆంగ్లేయుడు ఇంటిపై దాడి చేసి అతనిని వధించి సాహెబ్ గంజ్‌కి వెళ్ళిపోయారు. దానికి భయపడిన కొందరు ఆంగ్లేయ అధికారులు పడవలపై ఎక్కి పారిపోయారు. భాగల్పూర్ కలెక్టర్ అప్పుడు రాజమహల్లోనే దాక్కోని ప్రాణాలు కాపాడుకున్నాడు.

మేజర్ యఫ్‌డబ్ల్యు మవారఫ్ నేతృత్వంలో 1855, జూలై 10న ఈ ఉద్యమాన్ని అణచడానికి పంపిస్తే సిద్ధూ సేన వారిని పరాజితులు చేసింది. వారు అంబర్ పరగణాపై దాడి చేసి కబ్జా చేశారు. కానీ ఎదురుకాల్పుల్లో వీరు ఓటమి చెందారు. వారిలో సుమారు 15000 మంది మరణించారు. నలుగురు అన్నదమ్ములు తప్పించుకున్నారు. ప్రజావిప్లవాలను అణచడానికి భాగల్పూర్‌లో మార్సన్‌లా పెట్టారు. ముర్ము సోదరులను అప్పగించిన వారికి బహుమతులను ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత ఒక యుద్ధంలో చాంద్, బైరవ్ ఇద్దరు చనిపోయారు. సిద్ధూ, కాన్హూ కూడా ఎవరో నమ్మకద్రోహం చేసిన కారణంగా బంధింపబడి 1856, జులై 26 నాడు ఉరి తీయబడ్డారు. ఆ వీరుల జ్ఞాపకంలో సంతాలి క్షేత్రంలో నేటికీ ఆ రోజుని సంతాల్ గిరిజనులు విశేషంగా జరుపుకుంటున్నారు.వారి స్మారకార్థం ప్రభుత్వం అదల్ హాటులో ఒక పార్క్‌ను, రాంచి లో ఒక యూనివర్సిటీని నెలకొల్పడం విశేషం.

గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News