Monday, December 23, 2024

‘సప్త సాగరాలు దాటి’ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ 

- Advertisement -
- Advertisement -

కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు మేకర్స్.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం జరిగిన రిలీజ్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, రచయిత బి.వి.ఎస్.రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “చార్లీ సినిమా సమయంలో రక్షిత్ గారిని కలిశాను. వారికి సినిమానే జీవితం. అందుకే వారు ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడూ మంచి సినిమాలు తీయాలనే వీరి తపన అభినందించదగ్గది. ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా కలిగిస్తోంది” అన్నారు.

రచయిత బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ.. ” డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఫోన్ చేసి ఇది అద్భుతమైన సినిమా, అర్జెంట్ గా చూడమన్నారు. నేను సినిమాకి సంబంధించిన వివరాలు అడుగుతుంటే కనీసం ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళమని చెప్పారు. దాంతో ఈ సినిమాని నేను కన్నడ వెర్షన్ లో చూశాను. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. అసలు ఇది ప్రేమ కథ అనాలా, జీవిత కథ అనాలా.. చెప్పడానికి మాటలు వెతుక్కోవాలి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా గురించే ఆలోచించేలా చేస్తూ ఇంటికి తీసుకెళ్ళిపోయే గొప్ప సినిమా ఇది. కన్నీళ్లు మానవత్వానికి సాక్ష్యమైతే.. కన్నీటి సంద్రం ఈ సినిమా.

ఇది అంత లోతైన సినిమా. ప్రేమ మనిషి చేత ఎంత తప్పయినా చేయిస్తుంది, ఎంత సాహసమైనా చేయనిస్తుంది. ఆ ప్రేమ ఎంత గొప్ప గొప్పదంటే.. సప్త సముద్రాలు అంత ఉండటమే కాదు, దాని ఆవల కూడా ఉందని చెప్పిన సినిమా ఇది. ఒక్క రిస్క్ వల్ల ఎంతమంది జీవితాలు ప్రభావితం అయ్యయో ఎంతో వివరంగా చూపించారు. ప్రతి షాట్ లోనూ కథ చెప్పారు. ఒక్క షాట్ మిస్ అయితే కథ ఏమైనా మిస్ అవుతాం అనిపించేలా ఉంది. సినిమా చివరిలో రెండో భాగం ఉందని గ్లింప్స్ చూపించారు. ఆ గ్లింప్స్ లో ఇంకా పెద్ద జీవితం ఉంది.

22 ఏళ్ల కుర్రాడికి 33 ఏళ్ల దాకా జీవితం చెప్పి.. 33 ఏళ్ల నుంచి మళ్ళీ ఎంత దాకా జీవితం అనుభవించాడు. జీవితంలో ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందని చెప్పడం మామూలు విషయం కాదు. రక్షిత్ శెట్టి ఇంత గొప్ప రచయిత కాకపోతే, ఈ కథని ఇంత గొప్పగా అర్థం చేసుకునేవారు కాదు. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ గారు మనకి జీవితాంతం గుర్తుండే పాత్ర పోషించారు. దర్శకుడు హేమంత్ గారు సినిమాని ఎంతో పొయెటిక్ గా తీశారు. ప్రతి ఫ్రేమ్ లో దర్శకత్వ ప్రతిభ కనిపించింది. ఈ సినిమా చూడటం అనేది మనకో మధురానుభూతి” అన్నారు.

కథానాయకుడు రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. “సప్త సాగర దాచే ఎల్లో మొదట కన్నడలో విడుదల చేశాం. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా విడుదల ఎందుకు చేయలేదని చాలామంది అడుగుతున్నారు. కొన్ని సినిమాలను మనం తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాటంతట అవే పయనిస్తాయి. ఈ సినిమాని మేం ఎంతగానో నమ్మాం. చార్లీ సినిమా కర్ణాటక తర్వాత తెలుగులోనే బాగా ఆడింది. అందుకే నేను ఈ ప్రాంతాన్ని సినిమా భూమిగా భావిస్తాను. ఇక్కడ సినిమాని ఒక సంస్కృతిగా చూస్తారు. నాక్కూడా సినిమానే జీవితం, సినిమానే దేవుడు. చార్లీ సినిమాని ఆదరించి, ఇక్కడ సప్త సాగర దాచే ఎల్లో విడుదలకు బాటలు వేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దర్శకుడు హేమంత్ కి ఇది మూడో సినిమా. మూడు సినిమాలు కూడా కన్నడలో మంచి విజయం సాధించాయి. ఇది అతని పూర్తి స్థాయి దర్శకత్వ ప్రతిభను తెలిపే చిత్రం. హీరోయిన్ రుక్మిణీ వసంత్ సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

కథానాయిక రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ.. “సెప్టెంబర్ 1న కన్నడ వెర్షన్ హైదరాబాద్ లో కూడా విడుదల కాగా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తుండటం సంతోషం కలిగిస్తోంది. మా మను-ప్రియ ల కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు హేమంత్ ఎం రావు మాట్లాడుతూ.. “ఈ సినిమా సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో మా సినిమా విడుదలవుతుండటం గర్వంగా ఉంది. ఈ ప్రాంతాన్ని సినిమా భుమిగా అభివర్ణిస్తారు. హైదరాబాద్ లో కన్నడ వెర్షన్ కొన్ని షోలు ప్రదర్శించగా ఊహించని స్పందన లభించింది. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా తెలుగులో విడుదల అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “ఈ సినిమా కన్నడలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించడుతోంది. చార్లీ సినిమాని తెలుగులో రానా గారు విడుదల చేయగా మంచి విజయం సాధించింది. రక్షిత్ గారికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని, ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని ఇక్కడ విడుదల చేయాలనుకున్నాం. కానీ ఎప్పుడైతే టీజర్ ను విడుదల చేశామో, సోషల్ మీడియాలో వచ్చిన అనూహ్య స్పందన చూసి, ఇక్కడ కూడా ఈ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారని అర్థమైంది. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

‘సప్త సాగరాలు దాటి’ చిత్ర ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ  చిత్రం తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News