ముజఫర్‌నగర్ : భారతీయ ఖైదీ సరబ్‌జిత్ సింగ్‌ను లాహోర్ జైలులో దారుణంగా చంపిన పాక్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్పరాజ్ అలియాస్ తంబా ఆదివారం పాకిస్థాన్‌లో హతమయ్యాడు. లాహోర్ లోని ఇస్లాంపుర ప్రాంతంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు అతడిపై కాల్పులు జరిపారు. ముంబై ఉగ్రదాడికి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన తంబాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
సరబ్ జిత్ సింగ్‌పై దాడి కేసులో నిందితులైన అమీర్‌సర్పరాజ్ , ముదస్సర్‌ను నిర్దోషులుగా పాకిస్థాన్ కోర్టు విడుదల చేసింది. విడుదలైన ఆరేళ్ల తరువాత ఈ హత్య జరిగింది. పంజాబ్ లోని భిఖివింద్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్ పొరపాటున పాక్ లోకి ప్రవేశించి అరెస్టయ్యాడు. గూఢచర్యానికి పాల్పడినట్టు, 1990లో పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో అతడి పాత్ర ఉందని ఆరోపించి పాక్ మరణశిక్ష విధించింది. 2013లో జైలులో కొందరు ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన సరబ్‌జిత్ సింగ్ తరువాత మే 2న గుండెపోటుతో మరణించాడు.