కోర్ట్ చిత్రంతో కెరీర్ బెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న వర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. జెంటిల్ మ్యాన్, సమ్మోహనం చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ,- శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూపా కొడవాయూర్, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, వైవా హర్ష, సాయి శ్రీనివాస్ వడ్లమాని, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమా హిట్ కావడం గ్యారెంటీ.
ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, వడ్లమాని శ్రీనివాస్, వీకే నరేష్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.ఓ మంచి ఫ్యామిలీ సినిమాను అందిస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ “సారంగపాణి జాతకం సినిమా కామెడీ, క్రైమ్ చిత్రం. క్రైమ్ అంశంతో కామెడీ సినిమాను అందించాం. నిర్మాత కృష్ణ ప్రసాద్ ఎంతో ప్రోత్సాహం అందించారు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన చిత్రమిది”అని పేర్కొన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ “మండు వేసవిలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగితే ఎంత ఆనందం ఉంటుందో.. ఈ సినిమా కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. వినోదంతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది” అని తెలిపారు.