Monday, December 23, 2024

దేశం కోసం గూఢచారిగా మారిన వనిత

- Advertisement -
- Advertisement -

వర్ణ, వర్గ, లింగ విభేదాలు లేకుండా ఎంతో మంది త్యాగధనులు అచంచల దేశభక్తి అనే పునాదులపై నిస్వార్థం అనే ఇటుకలతో నిర్మించిన ఈ సువిశాల భారతదేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్న మనం నిజంగా అదృష్టవంతులమని చెప్పవచ్చు.బ్రిటిష్ వలసవాదపాలన నుండి భరతమాత బానిస సంకెళ్ళను త్రుంచడానికి శక్తి వంచన లేకుండా పురుషులతో సమానంగా ఎందరో ధీరవనితలూ స్వాతంత్య్రసమరంలో పాల్గొని తమ వంతు పాత్రను నిర్వహించినప్పటికీ వారి చరిత్ర అంతగా వెలుగులోకి రాకపోవడం దురదృష్టం. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాటలతో ప్రేరణ పొందిన సరస్వతి రాజమణి కేవలం పదహారేళ్ళ లేతప్రాయంలో తన ఆభరణాలను తృణప్రాయంగా నేతాజీకి అందించగా వాటిని తిరిగి ఇచ్చేయడానికి ఆయన స్వయంగా వారింటికి వెళ్ళినప్పటికీ ఆమె అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఆమె దేశ భక్తికి మెచ్చిన నేతాజీ అప్పుడు ఈ లక్ష్మి (ఆభరణాలు) నీతో ఎల్లకాలం ఉండకపోవచ్చు

కానీ నీలోని సరస్వతి (జ్ఞాన సంపద) ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అందుకే ఇప్పటి నుండి నీ పేరు సరస్వతి అని అనడంతో అప్పటినుండి ఆమె పేరు సరస్వతి రాజమణిగా స్థిరపడిపోయింది. వారసత్వంగా అబ్బిన జాతీయ భావాలు: బర్మా (నేటి మయన్మార్)కు వలస వెళ్ళిన ఒక సంపన్న తమిళ కుటుంబంలో 11 జనవరి 1927 న రాజమణి రంగూన్‌లో జన్మించారు. తన తండ్రి మెండుగా జాతీయ భావాలు గల వ్యక్తి కావడంతో ఆమె ఆ వారసత్వాన్ని సహజంగానే పుణికిపుచ్చుకున్నారు. స్వదేశాన్ని అమితంగా ప్రేమించే ఆమె తండ్రి భారత స్వాతంత్య్రానికి సంబంధించి స్థానికంగా ఏ ఉద్యమం జరిగినా తన కుమార్తెతో సహా అందులో పాల్గొనేవారు. బ్రిటిష్ పాలనలో ఉన్న నాటి బర్మా ప్రజలలో జాతీయ భావాలు పాదుకొల్పేందుకు 1937లో మహాత్మా గాంధీ ఆ దేశాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ స్థిరనివాస మేర్పరచుకున్న కొందరు తమిళులతో పాటు రాజమణి కుటుంబాన్ని కూడా సందర్శించారు. ఆ సమయంలో అతని దృష్టి బొమ్మ తుపాకీతో ఆడుకుంటున్న 10 సంవత్సరాల రాజమణిపై

పడడంతో యాదృచ్ఛికంగా తుపాకీతో ఆడుకుంటున్నావు పెద్దయ్యాక షూటర్ కావాలనుకుంటున్నావా అని అడగ్గా లేదు, బ్రిటిష్ వారిని చంపేందుకు అని ఆమె ఛటుక్కున సమాధానమిచ్చింది. అందుకు గాంధీ స్వాతంత్య్ర సాధన కోసం మనం ఎంచుకున్న అహింసాయుత మార్గం మాత్రమే అనుసరణీయం అనగా ఆమె విభేదిస్తూ బ్రిటిష్‌వాళ్ళు మన దేశ సంపదను దోచుకుంటున్నారు. దోపిడీ చేసే వారిని వదిలిపెట్టవద్దు, మట్టుబెట్టాలి. నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిష్ అధికారినైనా కాల్చి చంపుతాను అంది. అలా బాల్యంలోనే గాంధీజీ నేతృత్వంలోని జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలైనప్పటికీ సైద్ధాంతికపరంగా విభేదించి, 1943లో బర్మాను సందర్శించడానికి వచ్చిన నేతాజీ అప్పటికే ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఎ) స్థాపించి సాయుధ బాటపట్టడంతో సహజంగానే ఆయన అనుయాయిగా మారాలని నిశ్చయించుకుంది. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అన్న నేతాజీ మాటలతో స్ఫూర్తిపొందిన 16 ఏళ్ళ సరస్వతి రాజమణి వెంటనే తన ఒంటి మీదున్న ఖరీదైన ఆభరణాలను సంస్థకు అందించారు.

వాణిజ్యం సాకుతో దేశంలో చొరబడి క్రమంగా రాజ్యాధికారాన్ని చేపట్టి దేశ సంపదను కొల్లగొడుతూ ప్రజల బతుకులను దుర్భరం చేస్తూ హింసిస్తున్న బ్రిటిష్‌వలస పాలకుల నుండి దేశానికి స్వాతంత్య్రం సిద్ధింప చేయాలన్న ఏకైక లక్ష్యంతో తనదైనశైలిలో పోరాటం కొనసాగిస్తున్న నేతాజీ సరస్వతి అంకితభావానికి ముగ్ధుడై, ఆమెను ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఎ) గూఢచర్య విభాగంలో రాణి ఝాన్సీ బ్రిగేడ్లో నియమించారు. ఐఎన్‌ఎలో చేరిన అతిపిన్న వయస్కురాలు, మొదటి మహిళా గూఢచారి సరస్వతి రాజమణి కావడం విశేషం. ప్రభుత్వం నుండి బ్రిటిష్ మిలిటరీ అధికారులకు అందే ఆదేశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి ఐఎన్‌ఎకు అందచేసే బాధ్యత ఆమెకు అప్పచెప్పబడింది. ఆమె ‘మణి’ అనే యువకుడి వేషధారణలో బ్రిటిష్ అధికారుల నివాసాలలో పని మనిషి మిషతో గూఢచర్యం నిర్వహించేది. కర్తవ్య నిర్వహణలో తన సహచర గూఢచారి ఒకరు బ్రిటిష్ అధికారులకు చిక్కడంతో, ఆమెను వారి బందీ నుండి విడుదల చేయించడం కోసం రాజమణి బ్రిటిష్ శిబిరంలోకి ప్రవేశించడానికి ఒక నృత్య కళాకారిణిగా దుస్తులు ధరించి,

బ్రిటిష్ అధికారిని ఏమార్చి, మత్తుమందు ఇచ్చి, తన సహచర గూఢచారిని రక్షించింది. అయితే అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బ్రిటిష్ అధికారులు జరిపిన కాల్పులలో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆమె ఆ గాయాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా వేగంగా పరిగెత్తి వారి నుండి తప్పించుకుని ఒక చెట్టుపైకి ఎక్కి మూడు రోజుల పాటు అక్కడే గడిపింది. ఆమె ఆచూకీని కనిపెట్టి బంధించడానికి బ్రిటిష్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ గాయం ఆమెకు శాశ్వత అవిటితనం కలిగించినప్పటికీ ఆమెలోని దేశభక్తి ఇసుమంతయిన తగ్గకపోవడం విశేషం. ఆమె అసమాన ధైర్యసాహసాలకు గుర్తింపుగా జపాన్ చక్రవర్తి ఆమెకు ఇండియన్ నేషనల్ ఆర్మీ రాణి ఝాన్సీ బ్రిగేడ్‌లో లెఫ్టినెంట్ హోదాతో పాటు పతకాన్ని అందించారు. ఆమె తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సహచర గూఢచారిని చాకచక్యంగా బ్రిటిష్ అధికారుల కళ్లుగప్పి తప్పించడంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలను స్వయంగా నేతాజీ కూడా ప్రశంసించారు. 2005లో జరిపిన ఒక ఇంటర్వ్యూలో

సరస్వతి రాజమణి నేతాజీ గురించి వివరిస్తూ ఆయన అరుదైన వ్యక్తిత్వం, గొప్పదార్శనికత గల వ్యక్తి. భవిష్యత్తును అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి అని కితాబిచ్చారు. ఊహించని సమయాలలో వివిధవేషాలలో వచ్చి ఆయన మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేవారు. స్వామివివేకానంద ప్రవచించే ఆదర్శాలను ప్రబలంగా విశ్వసించే నేతాజీ మనందరికీ దేవుడు లాంటివాడు అని చెప్పడం ఆమెకు ఆయన పట్ల గల ఆదరాభిమానాలను సూచిస్తుంది. అయితే దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం ధారపోసి జీవిత చరమాంకంలో సైతం సమాజాభ్యున్నతికి పాటుపడిన రాజమణి సరస్వతిలాంటి అరుదైన స్వాతంత్య్ర సమరయోధురాలి గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడం అత్యంత బాధాకరం. దేశసేవ కోసం అనునిత్యం పరితపించి అలసిసొలసి 13 జనవరి 2018 న చెన్నైలోని రాయపెట్ట పీటర్స్ కాలనీలో దేశం గర్వించదగ్గ మరొక గొప్ప స్వాతంత్య్ర సమరయోధురాలు సరస్వతి రాజమణి తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News