Wednesday, January 29, 2025

సరస్వతీ నది పుష్కరాలకు రూ.25 కోట్ల నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీ నది పుష్కరాలకు రూ. 25 కోట్లు మంజూరు చేసినందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సరస్వతీ నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ,

డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్‌లను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయ వంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం 2013లో వచ్చిన సరస్వతీ నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో గతంలో కంటే మిన్నగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా, అత్యంత వైభవోపేతంగా సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ మారుతిపై వేటు
సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులపై వేటుపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్ వివాదానికి సంబంధించి దేవాదాయశాఖ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ మారుతిపై బదిలీ వేటు పడింది. ఆలయ ఈఓను కరీంనగర్ జిల్లా మానుకొండూర్ గుట్టుదుద్దనపల్లి శ్రీఆంజనేయస్వామి ఆలయానికి దేవాదాయశాఖ అధికారులు బదిలీ చేశారు. మారుతి స్థానంలో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయానికి గతంలో ఈఓగా పనిచేసి

కొడవటంచ లక్ష్మీనరసింహ దేవస్థానానికి బదిలీ అయిన గ్రేడ్-1 అధికారిమహేశ్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు. అలాగే షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, ఈనెల 20వ తేదీన అనుమతి లేకుండా ముక్తేశ్వర ఆలయ గర్భగుడిలో సింగర్ మధుప్రియ ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. సాధారణంగా కాళేశ్వర ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉండదు. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా మధుప్రియ పాటలు చిత్రీకరించారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News