Tuesday, December 24, 2024

ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడానికి రౌస్ అవెన్యూ కోర్టు గురువారం అనుమతించింది. ఈ మేరకు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను స్పెషల్ జడ్జి ఎంకె నాగ్‌పాల్ అనుమతించారు.‘ ఈ కేసు గురించి స్వచందంగా వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసులో అప్రూవర్‌గా ఉండాలనుకొంటున్నాను’ అని శరత్‌చంద్రారెడ్డి తన దరఖాస్తులో పేర్కొన్నారు.

శరత్ చంద్రారెడ్డికి ఇటీవల ఢిల్లీ హైకోర్టు వైద్య కారణాలపై బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా అధినేత అయిన శరత్ చంద్రారెడ్డి వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ ఏర్పాటు చేసుకుని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారంటూ శరత్ చంద్రారెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అభియోగాలు చేసింది.

దీంతో పాటుగా నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో ఇంతకు ముందు ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News