ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) అధ్యక్షుడిగా మరోసారి అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎసిఎ ఎన్నికల ఫలితాల ప్రకటనపై ఉన్న అడ్డంకి తొలగడంతో ఫలితాలను ఎసిఎ ప్రకటించింది. ఎసిఎ ఎన్నికలకు మాజీ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
ఎసిఎ ఎన్నికల్లో అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వైసీసి ఎంపి విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి పదవికి ఎస్‌ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపినాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా రాకేష్, కోశాధికారిగా వెంకటాచలం, కౌన్సిలర్‌గా పురుషోత్తమ రావు నామినేషన్లు వేశారు. అయితే ఆయా పదవుల కోసం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలను ఈనెల 3వ తేదీనే ప్రకటించాల్సివుంది.
అయితే ఎసిసి ప్రస్తుత ప్రెసిడెంట్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డిపై అనర్హత వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆశ్రయించింది. లోధా కమిటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సిఫార్సులను పాటించకుండా ఎసిఎ ఎన్నికలు జరిగాయని సవాల్ చేసింది. అయితే, తాజాగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో ఎసిఎ క్రికెట్ ఎన్నికల ఫలితాల ప్రకటనకు అడ్డంకి తొలగింది. ఫలితాలను ప్రకటించేందుకు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రరాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.