Thursday, December 26, 2024

సర్దార్ పటేల్‌కు భారత రత్న సుదీర్ఘ కాలం ప్రకటించలేదు:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి చేసిన అపార కృషిని తుడిచిపెట్టేందుకు, చిన్నబుచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఆయనకు సుదీర్ఘ కాలం భారత్ రత్న దక్కకుండా చేశారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ఆరోపించారు. పటేల్ జయంతికి ముందు ‘సమైక్యత కోసం పరుగు’ కార్యక్రమాన్ని అమిత్ షా జెండా ఊపి ప్రారంభిస్తూ, దేశం తొలి హోమ్ శాఖ మంత్రి దూరదృష్టి, చతురత కారణంగా 55 పైచిలుకు రాజ సంస్థానాలు భారత్‌లో విలీనం అయ్యాయని, దేశం ఏకమైందని చెప్పారు. సర్దార్ పటేల్ వల్లే లక్షద్వీప్ దీవులు, జునాగఢ్, హైదరాబాద్, అన్ని ఇతర రాజ సంస్థానలు భారత్‌లో విలీనం అయ్యాయని ఆయన తెలిపారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ‘ఐక్యత కోసం పరుగు’ కార్యక్రమంలో పాల్గొంటున్నవారిని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ, ‘అయితే, దేశానికి సర్దార్ పటేల్ చేసిన అపార సేవలను తుడిచిపెట్టేందుకు, కించపరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి.

ఆయనకు సుదీర్ఘ కాలం భారత రత్న పురస్కారాన్ని దక్కనివ్వలేదు’ అని విమర్శించారు, ప్రధాని నరేంద్ర మోడీ కేవడియాలో పటేల్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆయనను సముచిత రీతిలో గౌరవించారని. ఆయన జ్ఞాపకాలను సజీవంగా నిలిపారని అమిత్ షా చెప్పారు. ప్రధాని మోడీ 2018లో గుజరాత్ కేవడియాలో 182 మీటర్ల ఎత్తు గల పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ లిబర్జీ’ని ఆవిష్కరించారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో విగ్రహం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను సర్దార్ పటేల్‌కు మరణానంతరం 1991లో ప్రదానం చేశారు. అప్పటికి ఆయన మరణించి 41 ఏళ్లు గడిచాయి. దేశ ప్రజలు ఇప్పుడు సమైక్యంగా ఉన్నారని, 2047 నాటికి భారత్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని కలను సాఫల్యం చేసేందుకు వారం తమను తాము అంకితం చేసుకున్నారని అమిత్ షా చెప్పారు.

‘2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ నిర్మించాలన్న ప్రతిజ్ఞను దేశ ప్రజలు అందరి ముందు ప్రధాని ఉంచారు. అప్పటికి ప్రపంచంలో ప్రతి రంగంలో భారత్ అత్యున్నత స్థానంలో ఉంటుంది’ అని ఆయన తెలిపారు. వర్ధిల్లుతున్న, అభివృద్ధి చెందుతున్న, దృఢమైన దేశంగా భారత్ ఇప్పుడు ప్రపంచం ముందు నిల్చున్నదని ఆయన చెప్పారు. ‘ఐక్యత కోసం పరుగు’ ద్వారా భారత్ సమైక్యతను బలపరుస్తామని, 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ కలను సాఫల్యం చేస్తామని ప్రతిన బూనవలసిందిగ పౌరులకు అమిత్ షా పిలుపు ఇచ్చారు. ‘పరుగు కోసం ఐక్యత’ను సాధారణంగా పటేల్ జయంతి రోజు అక్టోబర్ 31న నిర్వహిస్తుంటామని, కానీ ఈ ఏడాది ఆ రోజు దీపావళి పండుగ ఉన్నందున రెండు రోజులు ముందుగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని హోమ్ శాఖ మంత్రి తెలియజేశారు. ‘మంగళవారం (29) ధన్‌తేరస్. ఈ శుభ సందర్భంలో ఈ పరుగును నిర్వహిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News