వనపర్తి ప్రతినిధి : బహుజనుల హక్కులకై పోరాటిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సర్వాయి పాపన్న 373వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కొని బహుజనులకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేశారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న ఆశయాలను ఆచరణలో పెడుతూ బహుజనులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బహుజనులు చేరడానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించి సర్వా యి పాపన్న ఆశయాలను సాధించడానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. అదనపు కలెక్టర్ యస్.తిరుపతి రావు, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, జిల్లా అధికారులు సైతం సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.