Friday, November 22, 2024

కార్పొరేట్‌కు దీటుగా సర్కార్ విద్య

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడిపిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు పాఠశాలల్లో ‘మన ఊరు మన బడి.. మన బస్తీ మన బడి’ పథకం ద్వారా మొత్తం రూ.5.65 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.2.30 కోట్లతో చేపట్టనున్న అదనపు తరగతి గదులు, ల్యాబోరేటరీ పనులకు అదేవిధంగా పాండురంగాపురంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.62.92 లకలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, ఖమ్మం నగరం రోటరీ నగర్ లోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన బస్తీ మన బడి పథకం ద్వారా రూ.72.66 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఆతరువాత ఖమ్మం నగరం నయా బజార్ లోని ప్రాథమిక పాఠశాలలో రూ.39.32లక్షలు, ఉన్నత పాఠశాలలో రూ.55.61 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, ఖమ్మం నగరం ఎస్ ఆర్ ఆండ్ బి డిగ్రీ కళాశాలలో రూ.1.05 కోట్లతో నిర్మించిన నూతన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుమంత్ర ప్రారంభించారు.

ఈ సందర్బంగా పలు పాఠశాలలో మంత్రి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు.అంతేగాక ప్రభుత్వం పాఠశాలలో వారం రోజుల్లో మూడు రోజులు రాగి జావ, మూడు రోజుల పాటు బాయిల్ ఎగ్ అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మంత్రి ప్రారంభించారు.పలు స్కూళ్ళలో మంత్రి,కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా జావా తాగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, అభ్యసనను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది విద్య మాత్రమే అని, అందుకే ముఖ్యమంత్రి కేసీఅర్ పేదలకు నాణ్యమైన విద్యను కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నేడు అందిస్తున్నారన్నారు.

ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతులు, పాఠశాల భవనాలు, తరగతి గదులు ఆకర్షణీయంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారని, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచుతాయన్నారు. అన్ని వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి వాటిని విద్యార్థులు, సిబ్బంది వినియోగించుకోగలిగితే మెరుగైన ప్రమాణాలు ఉత్పన్నమవుతాయని గుర్తించిన ప్రభుత్వం నేడు అవి అమలు చేసి చుపిందన్నారు. కనీస సదుపాయాలు అయిన వాటర్ ట్యాంక్, మరుగుదొడ్లు, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, ఫర్నిచర్ సమకూరాయని, శిథిలావస్థలో ఉండే పాఠశాల ఇప్పుడు ‘కార్పొరేట్’ స్థాయికి చేరుకున్నయన్నారు.

ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవని ఇప్పుడు. అలాంటి పాఠశాలలు ‘మన ఊరు- మన బడి’తో పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుతున్నాయని మంత్రి తెలిపారు. ‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, విద్యుదీకరణ డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్ స్మార్ట్‌క్లాస్ పరికరాలు, గ్రీన్ చాక్‌పిస్ బోర్డులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, ఫర్నీచర్ అందుబాటులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా పాఠశాలలో డిజిటల్ విద్యా విధానం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతి సమాజంలోని అట్టుడుగునవున్న వారికి ఉపయోగపడినప్పుడే సార్థకత అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా నమ్ముతున్నదని అందుకే కేసీఅర్ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలలో కూడా లేని విధంగా నేడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేశామన్నారు.

కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన డిజిటల్ పాఠాలను ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తామన్నారు. దీంతో తెలంగాణలో సర్కారు బడుల స్థితిగతులే మారనున్నాయని, ప్రభుత్వ విద్యను ఉన్నత శిఖరాల వైపు ముఖ్యమంత్రి కేసీఅర్ నడిపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇచ్చి మొక్కలు పెంచుతున్నారని, ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు సమకూరుతుండడంతో పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలలపై నమ్మకం పెరుగుతున్నదన్నరు.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా తొలివిడత ‘మన ఊరు- మనబడి/ మన ఊరు- మనబస్తీ’కి 426 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయని, ఆయా పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తి చేయడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.గతంలో లాగా విద్యా సంవత్సరం మధ్యలో పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా ఈ సంవత్సరం నుండి పాఠశాల ప్రారంభంలోనే అన్ని పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తూన్నమని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ, పండుగ వాతావరణం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొందని, పాఠశాలలు సకల సౌకర్యాలతో, ప్రయివేటు పాఠశాలల కంటే గొప్పగా పునఃప్రారంభం అయ్యాయన్నారు. మంచి పెయింటింగ్, డ్యూయల్ డెస్క్, డిజిటల్ తరగతులు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, టాయిలెట్ బ్లాకులు, ఇంటరాక్ట్ బ్లాక్ ప్యానెల్ లు అన్ని సౌకర్యాల కల్పన చేసినట్లు తెలిపారు. నగరంలో 90 శాతం పాఠశాలల పనులు పూర్తయినట్లు, త్వరలోనే అన్ని పనులు పూర్తయి, రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉండి, ఆదర్శంగా నిలిచినట్లు ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News