బకాయిలు, బిల్లుల చెల్లింపులు
వేగవంతం చేసిన ప్రభుత్వం
కార్మికులకు ప్రతినెలా జీతాలు
రూ.300 కోట్ల ఉపాధి హామీ
నిధులు విడుదల క్షేత్రస్థాయి
ఎన్నికలకు సన్నద్ధత గ్రామాల
వారీగా సమస్యలపై ఆరా,
సాధ్యమైనంత త్వరగా
పరిష్కారాలు మూడు
పథకాల అమలు వేగవంతం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో త్వర లో జరుగనున్న పంచాయతీ ఎన్నికలపై ప్రభు త్వం పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది. గ్రామ స్థాయి నుంచి బలోపేతమయ్యేందుకు అవసరమైన చర్యలను చేపడుతోం ది. బిల్లులు చెల్లింపుల నుంచి ఉద్యోగుల సమస్యల వరకు అన్నింటా సానుకూలంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని వ్యూహరచన చేస్తోంది. దీనిలో భాగంగా ఒక్కొక్క అంశంపై దృష్టిపెట్టి గ్రామ స్థాయిలో సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకునే దిశగా పావులు
కదుపుతోంది.
ప్రత్యర్థి బిఆర్‌ఎస్, బిజెపిలకు విమర్శలు, ఆరోపణలకు అవకాశం లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రత్యేకాధికారుల పాలనకు ముగింపు పలకాలని భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని మౌఖిక ఆదేశాలు వెలువడ్డంతో ఆయా పనులపై కలెక్టర్లు దృష్టిసారించారు. జిల్లాల వారీగా గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మిషన్ భగీరథ కింద గ్రామాల్లో మంచి నీటి సరఫరా జరుగుతోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
అందులో భాగంగా గతంలో ఉపయోగించిన బోర్లకు మరమ్మతులు చేసి వాటిని సిద్ధం చేస్తున్నారు. రానున్న వేసవిలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చక చకా పనులు చేపడుతోంది. అలాగే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రేషన్ కార్డులు లేనివారికి కొత్తగా రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి వాటి అమలును వీలైనంత త్వరగా చేపట్టాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ నెల 26 రిపబ్లిక్ డే సందర్భంగా వీటిని అమల్లోకి తేవడం ద్వారా గ్రామ స్థాయిలో పట్టు సాధించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
కార్మికులకు ప్రతి నెల జీతాల చెల్లింపు
గ్రామ స్థాయి ఉద్యోగ సమస్యల్లో ప్రధానమైన పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లింపు అంశాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వం ప్రతి నెల జీతాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయతీల్లో సుమా రు 92,351 వేల మంది పంచాయతీ కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలు సైతం చెల్లించేందుకు ఆదేశించారు. కార్మికులకు ప్రతి నెలా వేతనాలు చెల్లించడం వల్ల గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవనే చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతే ్యక బడ్జెట్ కేటాయించి గ్రీన్ చానల్ ద్వారా వేతన చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నేతలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
జీవో నెంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ గ్రామపంచాయితీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఎఫ్టీయూ తెలంగాణ గ్రామపంచాయతీ కారొబార్, బిల్కలెక్టర్ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ చానల్ ద్వారా వేతన చెల్లింపులు చేయాలని తాజాగా ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగుల ఇబ్బందులు పరిష్కరించట్లయ్యింది. పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాల కింద ప్రతి నెలా రూ.116 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని పంచాయతీరాజ్, ఆర్థికశాఖ అధికారులను సిఎం ఆదేశించారు. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను ప్రతి నెలా చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుకు దశల వారీగా చెల్లింపు
సర్పంచ్‌లు ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశాన్ని కూడా ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా తీసుకుంది. దశలవారీగా చిన్న చిన్న బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.20 లక్షల లోపు ఉన్న బిల్లులను చెల్లించేందుకు అంతర్గతంగా నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సర్పంచ్‌ల బిల్లులకు కూడా మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో సర్పంచ్‌లు పలు అభివృద్ధి పనులు చేశారు. కానీ వాటికి బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఉన్న పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ప్రతి నెలా 25 శాతం చెల్లిస్తోందని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో దాదాపు రూ.200 కోట్లను మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు చెల్లించారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలోగా మరో రూ.250 కోట్ల మొత్తాన్ని పెండింగ్ బిల్లుల కోసం ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉంది.
రూ.300 కోట్ల ఉపాధిహామీ బిల్లులు చెల్లింపు
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులకు సంబంధించి రూ.300 కోట్లను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీంతో గ్రామ స్థాయిలో పనులు చేసిన వారికి ప్రభుత్వం ఈ నిధుల విడుదలతో మరింత ఊరట కల్పించినట్లయ్యింది. దాదాపు రూ.600 కోట్ల ఉపాధి పనుల బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రూ.300 కోట్లను రాష్ట్రం తరఫున మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఆఘమేఘాల మీద జమ చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుండి పెండింగ్‌లో ఉన్న సుమారు 1.26 లక్షల ఉపాధి పనులకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.