మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ వలసల పర్వం ఊపందుకుంది. ఈ ఎన్నికలో పధాన పార్టీలైన టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్‌లు గెలుపు కోసం ఓ వైపు ప్రచారానికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు మునుగోడు నియోజకవర్గంలోని బలమున్న నేతలను తమ వైపునకు తిప్పుకునేలా వ్యూహాలు పన్నుతున్నాయి. తద్వారా తమ తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే పనిలో ఆయా పార్టీల అగ్రనేతలు పడ్డారు. ఈ వలసల వ్యూహరచనలో కాంగ్రెస్ వెనుకబడినప్పటికీ అధికార టిఆర్‌ఎస్, బిజెపిలు మాత్రం పోటాపోటీగా వలసలను ప్రొత్సహిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఓ వైపు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూనే మరోవైపు నియోజకవర్గంలో నేతలను తమవైపునకు తిప్పుకునేలా చేసుకోవడంలో కాంగ్రెస్ కంటే టిఆర్‌ఎస్, బిజెపిలు ముందు వరసలో ఉన్నాయని చెప్పొచ్చు. వలసల పర్వం కొనసాగింపులో టిఆర్‌ఎస్, బిజెపిలు పరస్పరం తమదే పైచేయి సాధించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
ఇటీవల రెండు ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బిజెపి మునుగోడులో సైతం తమ గెలుపు ఖాయమంటూ పెద్ద ఎత్తున వలసలను ప్రొత్సహిస్తుంటే.. మునుగోడు అభివృద్ధి టిఆర్‌ఎస్ వల్లనే సాధ్యమంటూ మునుగోడులో ప్రధాన నేతలకు వల వేస్తుంది. ఇలా పరస్పరం ఈ రెండు పార్టీలు మునుగోడు నేతలను తమ తమ పార్టీలోకి చేర్చుకునే విధంగా పావులు కదుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమది సిట్టింగ్ స్థానం కాబట్టి తమ వైపే మునుగోడు ప్రజలున్నారంటూ నేతలకు వలవేస్తుండటం గమనార్హం. అయితే టిఆర్‌ఎస్, బిజెపిలు మాత్రమే కాంగ్రెస్ కంటే వలసలను ప్రొత్సహించడంలో ఒకడుగు ముందున్నాయనేది నిర్వివాదాంశం. ఇందుకు ఇటీవల జరిగిన ఘటనలే అందుకు సాక్షిభూతాలుగా నిలుస్తు న్నాయి. భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నర్సయ్యగౌడ్‌తో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన మరో సీనియర్ నేత సైతం బిజెపి అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో కీలక నేత, ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పల్లె రవికుమార్ గౌడ్ టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పల్లె రవికుమార్ దంపతులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సామాజిక వర్గ విశ్లేషణలతో మునుగోడులో గెలుపే తమ పరమావధిగా టిఆర్‌ఎస్, బిజెపిలు పోటీపోటీగా వలసల పర్వానికి తెరదీశాయి. తొలుత నయానో భయానో ఆయా నేతలను ఒప్పించే ప్రయత్నానికి ప్రధానంగా ఈ రెండు పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఈ విధంగా నేతలను తమవైపుకు తిప్పుకోవడంలో టిఆర్‌ఎస్, బిజెపిలు తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి.
ఈ క్రమంలో భారీ ఎత్తున సొమ్ములు సైతం చేతులు మారుతున్న దాఖలాలు లేకపోలేదు. ఓ వైపు కాంగ్రెస్‌కు ఝలక్ ఇస్తూనే మరోవైపు పార్టీలో అసమ్మతులను బుజ్జగిస్తూ.. ఇంకోవైపు ప్రముఖ నేతలతో పాటు ఏ ఒక్క నేతను వదలని రీతిలో తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో టిఆర్‌ఎస్ ముందుందని చెబుతున్నారు. ఈ వలసల ప్రొత్సాహంలో బిజెపి తక్కువేమీ తినలేదు. రాష్ట్ర నేతలను ఓ వైపు ప్రొత్సహిస్తూనే మరోవైపు ఢిల్లీలోని అగ్రనేతలు సైతం జోక్యం చేసుకుని మరీ వలసలకు ప్రొత్సాహాన్నందిస్తున్నారని మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3వ వార్డులలోని బీజేపీ కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2వ వార్డు కు చెందిన బిజెపి ముఖ్య కార్యకర్తలు జంపాల యాదగిరి, జంపాల యాదయ్య, జంపాల సాయి, తీగల వెంకటేష్, జంపాల లింగస్వామి, జంపాల సత్తయ్య, శ్రీనివాసచారిలు వారి కుటుంబ సభ్యులు టిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చండూరు మండలంలో జడ్పీటిసి కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో ఐదు గ్రామాలకు చెందిన సర్పంచ్ లు బిజెపిని వీడి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నవారిలో చండూర్ మండలం కస్థాల గ్రామ సర్పంచ్ మెండి ద్రవపతమ్మ వెంకట్ రెడ్డి, నేర్మేట గ్రామ సర్పంచ్ నంది కొండ నర్సిరెడ్డి గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాష్, దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మల పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కూరపాటి లక్ష్మి ఉన్నారు. వీరితోపాటు మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత, సత్యనారయణ గౌడ్ దంపతులుతో పాటు మునుగోడు మండలం కిష్టాపురం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం లు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో గెలుపును శాసించే ఓ సామాజిక వర్గ నేతలను తమవైపుకు తిప్పుకునేలా బిజెపి, టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పటికీ.. టిఆర్‌ఎస్, బిజెపిలు మాత్రమే ఆ దిశగా సక్సెస్ అవుతున్నాయనే చెప్పొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు కొనసాగడం సహజమే. జంపింగ్ జపాంగ్‌లు అదునుచూసి గోడ దూకడం సహజమే. అయితే ఎన్నికల రేసులో ప్రముఖ నేతలను గాలం వేయడంలో ఆయా పార్టీల నైపుణ్యత కానవస్తోంది. ఈ విషయంలో మునుగోడులు టిఆర్‌ఎస్‌దే పై చేయిగా చెబుతున్నారు. ఎన్నిక సమీపిస్తున్న కొద్గీ ఈ వలసల పర్వం మరింతగా కొనసాగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల భావనగా ఉంది. అయితే గెలుపును ప్రభావితం చేసే సామాజిక వర్గ నేతలను తమ వైపుకు తిప్పుకుని తద్వారా విజయఢంకా మోగించాలనేది టిఆర్‌ఎస్, బిజెపి భావనగా ఉంది. ఆ దిశగానే ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయని చెబుతున్నారు.