ఎల్బీనగర్ : బిసి కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడంతో సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తుదారులతో కిటకిటలాడుతుంది. ఈనెల 20వ తేదీన బిసికుల వృత్తులకు దరఖాస్తు గడువు ముగుస్తుండడంతో ఆశావహులు కుల ఆదాయ ధృవపత్రాలు చేతికి రాక ఆందోళన చెందుతున్నారు. సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో గత రెండు రో జులుగా సర్వర్‌డౌన్ కావడంతో మంజూరు మరింత ఆలస్యం అవుతుంది.
కుల ఆదాయ ధృవ పత్రాల కోసం కొంతమంది మీ సేవా సెంటర్ వెళ్లగా మరి కొంతమంది నేరుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. రెండురోజులుగా సర్వర్‌డౌన్ నిలిచిపోవడంతో ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు సుమారుగా 7500 దరఖాస్తులు నిలిచిపోయాయని తెలుస్తోంది. దరఖాస్తులు నిలిచిపోవడంతో విద్యార్థులు , ఆశావహులు కార్యాలయం ఎదుట నిలబడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతెలంగాణ ప్రతినిధి సరూర్‌నగర్ తహసీల్దార్ జయశ్రీ వివరణ కోరగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లామని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.