- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ బ్యూరో: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికి స్పూర్తిదాయకమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, బిసి సంఘాల బాధ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అన్యాయాన్ని ఎదురిస్తూ, సర్వాయి పాపన్న గౌడ్ చూపిన పోరాట తెగువ అనన్య సామాన్యమైనదని కొనియాడారు.
రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తికుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన్య దైర్య సాహసాలతో పోరాటం చేయడం జరిగిందన్నారు. సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. గీత కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ హితవు పలికారు.
కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బిసి సంఘాల బాధ్యులు, గౌడ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.