సత్యదేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి, తన రెండో ప్రాజెక్టుగా ‘సర్వం శక్తిమయం’ అనే సిరీస్ కి దర్శకత్వం వహించారు. దీనికి కథ అందించిన బివిఎస్ రవి క్రియేటర్ గా వ్యవహరించగా, ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేశారు. ‘ఆహా’లో విడుదలైన పది ఎపిసోడ్ల ఈ సిరీస్… శక్తి పీఠాల గురించి, హిందూ మతం విశిష్ఠత గురించి తెలియజేసే విధంగా ఆసక్తికరంగా రూపుదిద్దుకుంది. దసరా సందర్భంగా విడుదలైన ‘సర్వం శక్తిమయం’ విశేషాదరణతో ఓటిటిలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రదీప్ మద్దాలి సిరీస్ రూపకల్పనలో తన అనుభవాలను పంచుకున్నారు.
మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి?
మాది రాజమండ్రి. ఇంజినీరింగ్ అక్కడే చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు సిఎస్సీలో టీం లీడర్ గా పని చేశాను. తర్వాత రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ లతో పరిచయమైంది. పూరి దగ్గర ఐదేళ్లు పనిచేశాను. ‘47 డేస్’ తో దర్శకుడిగా మారాను.
‘సర్వం శక్తిమయం’ లాంటి చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్టుని మీ సెకండ్ ప్రాజెక్ట్ గా తీసుకున్నప్పుడు రిస్క్ అనిపించలేదా?
ఇలాంటి సబ్జెక్టు చేయడం చాలా పెద్ద బాధ్యత. నాకు బివిఎస్ రవి బాగా పరిచయం. అయన రకరకాల ప్రాజెక్ట్స్ పై చర్చించేందుకు పిలిచేవారు. ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ కి బివిఎస్ రవి క్రియేటర్, రైటర్. ఆయన ఈ ఐడియా చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. చాలా మంచి అవకాశమనిపించి, వెంటనే చేస్తానని చెప్పాను.
ఇంత పెద్ద ప్రాజెక్టుకి మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు మీకేం అనిపించింది?
ఆయనకి నా గురించి బాగా తెలుసు. నేను పూరి దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంట్ లో ఉన్నప్పటినుండీ ఆయన నన్ను చూస్తున్నారు. మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ అనుకున్నాం. ఆయనకు ఈ ఐడియా వచ్చిన వెంటనే, దానిపై ఆయనకి వెర్షన్స్ ఇచ్చేవాణ్ణి. అందుకనే ప్రదీప్ ఇది చేయగలడని నమ్మకం వచ్చిందేమో.
రామ్ గోపాల్ వర్మ, పూరి, రవి…. ఈ ముగ్గురిలోనూ ఉండే ఒక కామన్ పాయింట్ గురించి చెప్పండి?
వారు ఎవరి దారిలో వారు వెళ్తున్నా, కామన్ పాయింట్ ఏంటంటే దే అర్ రెబెల్ ఇన్ దైర్ ఓన్ వేస్.
పూరి దగ్గిర నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటి?
ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మన్. హీరో నుండి లైట్ బాయ్ వరకు అందరినీ ఒకేలా చూసేవారు. ఆయననుంచి ఎన్నో నేర్చుకోవచ్చు.
మీ ప్రాజెక్టును క్రియేటివ్ పర్సన్స్ అందరూ కలిసి చేసినట్టుంది. అందరితో ఎలా ట్రావెల్ అయ్యారు?
అది అలా కుదిరిందండీ. బివిఎస్ రవి, ఈ ప్రాజెక్ట్ క్రియేటివ్ హెడ్ హేమంత్ మధుకర్ చాలా రోజులనుండీ దీని మీద వర్క్ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత నేను ఎంటరయ్యాను. ప్రాజెక్ట్ స్కేల్ చాలా పెద్దది. వర్కింగ్ డేస్ తక్కువ. 58 రోజుల్లో చేశాం కానీ, లొకేషన్స్ కోసం చేసిన ట్రావెల్, రెక్కీ ఇవన్నీ బాగా సమయం తీసుకున్నాయి. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే అవన్నీ చేయగలిగాం.
ఇంత స్పిరిచ్యుల్ సబ్జెక్టును డీల్ చేశారంటే, మీలో కూడా ఆధ్యాత్మిక భావనలు ఉండి ఉండాలి. ఎంతవరకు మీరు ఆ దారిలో ఉన్నారు?
మాది సాంప్రదాయ కుటుంబం. మా అమ్మగారు ఎప్పుడూ పూజలు చేస్తుంటారు. నేను మొదట్లో అలా ఉన్నా తర్వాత రామ్ గోపాల్ వర్మతో, పూరితో పనిచేసేటప్పుడు వాటికి దూరంగా ఆలోచించేవాడిని. నా సొంత ప్రయత్నాలు మొదలుపెట్టాక మళ్ళీ నా రూట్స్ కి వెళ్లాల్సి వచ్చింది. నేను ఒక ఆధ్యాత్మిక దారిలోకి వెళ్లాను. ధ్యానం, క్రియ యోగ, సిద్హ యోగ చేశాను. దానిలో ఉన్న శక్తి నాకు అర్థమైంది. మనం చేస్తున్న పనికి తోడుగా ఒక ఎనర్జీ ఉండాలనే విషయం అర్ధమైంది. ఈ ఆలోచనలో ఉండగానే రవి నుండి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆయనకు ఈ ప్రాజెక్టుకి నేను కరెక్ట్ అనుకోవడానికి ఇది ఒక కారణం అయ్యుండొచ్చు.
ఇలాంటి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది. ఎలా హేండిల్ చేయగలిగారు?
అదృష్టవశాత్తు మాకు అద్భుతమైన నటులు దొరికారు. ప్రియమణి, సంజయ్ సూరి, సమీర్ సోని, ఆశ్లేష ఠాకూర్… లాంటి మెచ్యూర్డ్ ఏక్టర్స్ ఉండడంతో నా పని చాలా సులువు అయింది.
ఇలాంటి స్పిరిచ్యుల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కొన్ని మనం అనుకోకుండా జరిగిపోతుంటాయి. అలాంటి మిరకిల్స్ ఏమన్నా జరిగాయా?
ఫస్ట్ షెడ్యూల్ మంచి సమ్మర్ లో స్టార్ట్ చేసాం. 18-20 రోజుల షెడ్యూల్ ఒరిస్సా నుండి కాశ్మీర్ వరకు ప్లాన్ చేసుకున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా అనుకున్న టైం లో పూర్తి చేశాం. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుకున్నది అనుకున్నట్టు చేయడం పెద్ద మిరకిల్. మా నిర్మాతలు విజయ్, అంకిత్, కౌముదిగార్లని అభినందించాలి. ముందుగా ఏ ఓటిటితోనూ టై అప్ అవకుండా అవసరమైనంత ఖర్చు పెడుతూ ప్యాషన్ తో చేశారు. ప్రాజెక్ట్ అంతా ఎగ్జిక్యూట్ చేసాక ఓటిటికి వెళ్లాం. ఇదే పెద్ద మిరకిల్ అనుకుంటాను.
చాలావరకు హిందీ యాక్టర్స్ ఉన్నారు? ఎందుకని?
ఈ ప్రాజెక్ట్ ఇండియా అంతా రీచ్ కావాలని హిందీ ప్రాజెక్ట్ లా చేశాం. అందుకని బాలీవుడ్ కాస్టింగ్ కి వెళ్ళాం. ప్రియమణితో బ్యాలన్స్ చేశాం. ఆవిడ కాస్టింగ్ కూడా కథకి అనుగుణంగానే ఉంటుంది.
శక్తి పీఠాలు అమ్మవారి శరీర భాగాలు పడిన స్థలాలుగా చెప్తుంటారు. వీటికి పురాణాలు, వేదాలలో ఆధారాలు ఉన్నాయా?
అమ్మవారి శక్తి పీఠాల కథ ఇందులో చెప్పాం. రచయిత తోట ప్రసాద్ అష్టాదశ శక్తిపీఠాలు ఎంతో శక్తిమంతమైనవిగా చెప్పారు. అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రదేశాలు అమ్మవారి శక్తితో నిండి ఉంటాయి. అందుకే భారత దేశం గొప్పదైంది. ఇది నమ్మకం మీద ఆధారపడిన అంశం.
‘ఆహా’లో తెలుగు, తమిళ్ వెర్షన్, జీ 5 లో హిందీ వెర్షన్ ఉంది. రెస్పాన్స్ ఎలా ఉంది?
జీ 5 లో హిందీ లో జూన్ 9న రిలీజ్ అయింది. రెస్పాన్స్ అద్బుతంగా ఉంది. ‘అహా’లో తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 20న విడుదలైంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశం నలువైపుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. రెగ్యులర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్ కాదు కాబట్టి, పోను పోను ఎంతో మందికి రీచ్ అవుతుంది. ఎంతో మంచి స్పందన చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
మీ తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్పండి?
రామ్ తాళ్లూరి గారి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకమైన వెబ్ సిరీస్ చేస్తున్నాను. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం.