ఇంద్రసేన కథానాయకుడిగా వేణు మడికంటి దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా ‘శాసనసభ’. ఈ చిత్రంతో కె.రాఘవేంద్రరెడ్డి రచయితగా పరిచయవుతున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “ఈ సినిమాకు కథ రాయడానికి కారణం హీరో ఇంద్రసేన. ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఆయన్ని చూస్తే కర్నాటక హీరోలకు తీసిపోని విధంగా వుంటాడు. ఆయన కోసం రాసిన కథ ఇది. మొదట్లో ‘అసెంబ్లీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభించాం. ఈ సినిమా కథ నచ్చి సప్పాని బ్రదర్స్ ముందుకు వచ్చారు. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదవడం, రాజకీయ జర్నలిస్టుగా వున్న అనుభవం కూడా ఈ సినిమా కథను ఉపయోగపడింది. కేజీఎఫ్, కేజీఎఫ్- 2 సినిమాల తరువాత సంగీత దర్శకుడు రవిబసూర్‌కు వున్న క్రేజ్ తెలిసిందే.
ఆయన ‘శాసనసభ’ సినిమాకు సంగీతం అందించడం కేవలం నిర్మాత షణ్ముగం సప్పాని వల్లే సాధ్యపడింది. ఆయన రవిబసూర్ వద్దకు తీసుకెళ్లి కథ వినిపించడం.. కేజీఎఫ్ మూవీ తరువాత 60 కథలు విన్నా కాదని రవిబసూర్ మా కథను ఒప్పుకోవడంతో గర్వంగా అనిపించింది. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణంగా వుంటుంది. రవిబసూర్ మ్యూజిక్ సినిమాను పరుగెత్తిస్తుంది. రాజకీయాల్లో జరిగిన సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని శాసనసభ కథను రాశాను. శాసనసభ అంటే పవిత్రస్థలం దానిని దేవాలయంగా భావించాలి. కానీ నేడు శాసనసభ విలువ మసకబారుతున్నట్లు అనిపించింది. అందుకే దాని విలువను ఈ తరం వాళ్లకు తెలియజెప్పాలి అనే వుద్దేశంతో ఈ కథను రాశాను” అని అన్నారు.