బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె జయలలిత సన్నిహితురాలు వికె శశికళకు ఇక్కడి కేంద్ర కారాగారంలో రాజభోగాలు కల్పించారని, ఇందుకోసం కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) చార్జిషీట్‌ను దాఖలు చేసింది. కర్నాటకకు చెందిన ఇద్దరు సీనియర్ జైలు అధికారులు, శశికళతో సహా ఆరుగురు వ్యక్తులపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు కర్నాటక హైకోర్టుకు ఎసిబి తెలియచేసింది. చెన్నైకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త కెఎస్ గీత దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ సూరజ్ గోవిందరాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం చిచారణ చేపట్టింది.
ఇద్దరు జైలు అధికారులను ప్రాసిక్యూట్ చేయయడానికి కర్నాటక ప్రభుత్వం 2021 డిసెంబర్ 30న అనుమతి ఇవ్వగా 2022 జనవరి 7న చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఎసిబి తెలిపింది. కోట్లాది రూపాయల అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి 2021 జనవరిలో విడుదలయ్యారు. ఎసిబి తన కేసులో ఎ 1 నిందితునిగా జైలు చీఫ్ సూపరింటెండెంట్ కృష్ణకుమార్, ఎ2గా సూరింటెండెంట్ అనితను చార్జిషీట్‌లో పేర్కొంది.