బెంగళూరు : అన్నాడిఎంకె బహిష్కత నాయకురాలు వికె శశికళ ఆదివారం ఇక్కడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ నుంచి రికవరీ నిర్థారణ కావడంతో డిశ్చార్జ్ జరిగింది. అవినీతి కేసులో జైలు శిక్షాకాలం పూర్తి కావడంతో శశికళ విడుదల అయ్యారు. అయితే కరోనా లక్షణాలు తలెత్తడంతో ఆమెను స్థానిక విక్టోరియా ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దశలో శశికళ తిరిగి తమిళనాడుకు చేరుకోనుండటం రాజకీయ వర్గాలలో సంచలనానికి దారితీసింది. శశికళ కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రి నుంచి తీసుకువెళ్లారు. డాక్టర్ల సలహా మేరకు ఆమె కొంతకాలం స్వీయ క్వారంటైన్‌లో ఉంటారని వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఆమె చెన్నైకు వెళ్లే అవకాశం లేదని, కనీసం వారం రోజులు బెంగళూరులోనే ఉంటారని సన్నిహితులు తెలిపారు. ఈ నెల 27వ తేదీనే శశికళ నాలుగేళ్ల జైలుశిక్ష కాలం పూర్తి తరువాత అగ్రహారం జైలు నుంచి విముక్తి పొందారు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి శశికళ బయటకు వస్తున్న దశలో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమెకు అభివాదాలు చేశారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు 300 మంది పోలీసు సిబ్బందిని మొహరించారు. ఈ రోజు తనకు నిజంగా పండుగ రోజు అని తమిళనాడుకు చెందిన శశికళ అభిమాని సాంబశివన్ ఆనందం వ్యక్తం చేశారు.
అన్నాడిఎంకె హక్కులు ఆమెకే : దినకరన్
తమిళనాడులో అధికారంలోని అన్నాడిఎంకె పార్టీ సర్వహక్కులు తన మేనత్త వికె శశికళకే చెందుతాయని టిటివి దినకరన్ స్పష్టం చేశారు. ఆమె ఇప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఉన్నారని, వాహనంపై పార్టీ జెండా వాడటంలో తప్పేమీలేదని స్పష్టం చేశారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శశికళను మేనల్లుడు స్వయంగా వెంబడి ఉండి కారులో తీసుకువెళ్లారు. కారుపై పార్టీ జెండా ఉంది. దీనిపై దినకరన్ స్పందించారు. ప్రధాన కార్యదర్శిగా ఆమె ఉన్నారు. కోర్టులో కేసుంది. ఇప్పటికీ పార్టీపై అధికారాలు ఆమెకే ఉన్నాయని దినకరన్ తెలిపారు. 2016 డిసెంబర్‌లోనే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమితులు అయిన విషయాన్ని దినకరన్ గుర్తు చేశారు.