Monday, December 23, 2024

తమిళనాట చిన్నమ్మ రీఎంట్రీ!

- Advertisement -
- Advertisement -

Aiadmk core committee to discuss sasikala induction

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న లీడర్లు అకస్మాత్తుగా గాయబ్ అవుతుంటారు. రాజకీయంగా వనవాసంలో ఉన్న నాయకులు సడన్ గా మళ్లీ రాజకీయ తెరపై ప్రత్యక్షమై హల్ చల్ చేస్తుంటారు. తమిళనాడు రాజకీయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కిందటేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన శశికళ మరోసారి తమిళ రాజకీయాల్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినీ నటి, తెలంగాణ బిజెపిలో యాక్టివ్‌గా ఉన్న విజయశాంతితో ఆమె ఇటీవల రహస్యంగా భేటీ అయినట్లు చెన్నై రాజకీయ వర్గాల సమాచారం. అయితే శశికళతో విజయశాంతి సమావేశం యాధృచ్చికమా లేక బిజెపి హైకమాండ్ ఆదేశాల మేరకు జరిగిందా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.

అన్నాడిఎంకె కు చిన్నమ్మే దిక్కా?

కిందటేడాది అక్టోబరులో మెరీనా బీచ్‌లోని మాజీ సిఎం జయలలిత సమాధి వద్దకు శశికళ వచ్చినప్పుడు ఆమె తీవ్రమైన భావోద్వేగంతో ప్రవర్తించారు. తమిళనాట జయలలిత పాలన మరోసారి రావాలంటే అన్నా డిఎంకె గ్రూపులన్నీ ఏకం కావాలంటూ పిలుపు ఇచ్చారామె. పరోక్షంగా తన నాయకత్వమే అన్నా డిఎంకె పార్టీని కాపాడుతుందన్న సంకేతాలు పంపారు. అంతేకాదు రానున్న రోజుల్లో ఇప్పటి పార్టీ నేతలంతా తన కనుసన్నల్లోనే పని చేయాల్సి ఉంటుందన్న హెచ్చరికలు కూడా ఆమె సైలెంట్ గా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత అన్నా డిఎంకె సైలెంట్‌గా ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి నైరాశ్యం నుంచి ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ బయటపడలేదు. సంచలన నిర్ణయాలతో డిఎంకె దూసుకుపోతుంటే అన్నా డిఎంకె ప్రేక్షకపాత్ర వహిస్తోంది. అంతకంటే చేయడానికి కూడా ఆ పార్టీ నాయకులకు పనేమీ లేకుండా పోయింది. దీంతో చాలా రోజులుగా చిన్నమ్మ మరోసారి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని అన్నా డిఎంకె లోని ఒక వర్గం కోరుకుంటోంది.

High Court refused to stay petition filed by Vijayashanti on Land Auction

ఎన్ని వివాదాలు చుట్టిముట్టినా, అన్నా డిఎంకెలో ఇప్పటికీ ఛరిష్మా ఉన్న లీడర్ చిన్నమ్మే, ఆమె ఎక్కడకు వెళ్లినా జనం నీరాజనాలు పడతారు. జేజేలు పలుకుతారు. అన్నా డిఎంకెలో అంత పెద్ద క్రౌడ్ పుల్లర్ మరొకరు లేరు. పార్టీని కింది స్థాయి నుంచి మరోసారి బలోపేతం చేయడానికి చిన్నమ్మ నాయకత్వమే ఏకైక దిక్కన్న అభిప్రాయం పార్టీలోని ఓ వర్గంలో బలంగా ఉంది. డిప్యూటీ సిఎంగా చేసిన పన్నీర్ సెల్వం అయితే చిన్నమ్మ రీఎంట్రీని కోరుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. శశికళ, పన్నీర్ సెల్వం ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్లు కావడం దీనికి ఒక కారణమంటున్నారు తమిళ రాజకీయ విశ్లేషకులు. అయితే మరో అన్నా డిఎంకె ప్రముఖుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి మాత్రం చిన్నమ్మ రాకను వ్యతిరేకిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ సంగతి ఎలాగున్నా ఇక ఇప్పటి విషయానికి వస్తే ఎన్నికల్లో ఓటమి తరువాత పళని స్వామి, పన్నీర్ సెల్వం కూడా మాట్లాడటానికి ఏమీ లేకుండా పోయింది. దీంతో పార్టీలో చిన్నమ్మ అభిమానులు యాక్టివ్ అయ్యారు. చిన్నమ్మ బరిలో ఉంటే డిఎంకెను ఢీ కొట్టే వారమన్న అభిప్రాయం అన్నా డిఎంకె కేడర్‌లో బలంగా నెలకొంది. దీంతో చిన్నమ్మను మరోసారి పాలిటిక్స్‌లోకి తీసుకురావడానికి ఆమె అభిమానులు పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. శశికళ రీ ఎంట్రీకి బిజెపి పెద్దలు కూడా ఓకే చెప్పినట్లు రాజకీయవర్గాల సమాచారం. కమలం పార్టీ నాయకుల అనుమతి, అంగీకారం లేకుండా అకస్మాత్తుగా చిన్నమ్మ దగ్గరకు సినీ నటి విజయశాంతి రావడం జరగదంటున్నారు రాజకీయ పండితులు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మే అన్నా డిఎంకె కూటమికి నాయకత్వం వహించాల్సి ఉంది. అయితే పళని స్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ కలిసి ఆమెపై కమలం పార్టీ అగ్ర నాయకులకు కట్టలకొద్దీ ఫిర్యాదులు చేయడంతో చిన్నమ్మకు వనవాసం తప్పలేదు. ఎన్నికలు జరగబోతున్న చివరి క్షణంలో అసలు పొలిటికల్ సీన్ నుంచే శశికళ తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు కూడా చిన్నమ్మ ప్రకటించాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళ పాలిటిక్స్‌లో ఇదొక యాంటీ క్లైమాక్స్. దీనికి ముందు చాలా పరిణామాలు సంభవించాయి,

ఒకదశలో బిజెపి నాయకులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా అన్నా డిఎంకె నాయకులు ససేమిరా అన్నారంటే ఆమెపై ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఒక దశలో చిన్నమ్మ సొంత పార్టీ పెడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. చిన్నమ్మ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే అన్నా డిఎంకె కేడర్ ఓట్లు చీలిపోయి స్టాలిన్ పార్టీ గెలుస్తుందన్న లెక్కలు కూడా వచ్చాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ డిఎంకెను అధికారానికి రాకుండా చేయాలన్న ధ్యేయంతో ఉన్న బిజెపి అగ్ర నాయకత్వం, రాత్రికి రాత్రి శశికళను హెచ్చరించడం, ఆమె రాజకీయంగా అంతర్థానం కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కమలం పార్టీ నాయకుల ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ దూకుడుకు బ్రేక్ వేయాలంటే శశికళను రంగంలోకి దించాల్సిందేనని బిజెపి ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చెన్నైలోకి శశికళ గ్రాండ్ ఎంట్రీ

కర్ణాటకలోని జైలు నుంచి విడుదలైన శశికళ కిందటేడాది ఫిబ్రవరిలో చెన్నై నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. బెంగళూరు నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరం వందలాది వాహనాల్లో అనుచరులు అనుసరిస్తుండగా… తమిళనాడులోకి అడుగుపెట్టారు చిన్నమ్మ. ఈ సందర్భంగా అన్నా డిఎంకె జెండాను తన కారుకు పెట్టుకున్నారామె. చెన్నైలో అడుగు పెడుతూనే జయలలిత రాజకీయ వారసురాలిని తానే… అనే అర్థం వచ్చేలా సంకేతాలు కూడా పంపారు. ఈ దశలో అన్నా డిఎంకెలోని ఒక వర్గం చిన్నమ్మ వెంట వెళ్లిపోతుందని, ఫలితంగా పార్టీ చీలిపోతుందని అందరూ ఊహించారు. దీంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. అన్నా డిఎంకె నాయకులు చకచకా పావులు కదిపారు. ఫలితంగా చెన్నైకు వస్తూనే హల్ చల్ చేసిన శశికళ.. ఒక్కసారిగా వెనక్కి తగ్గారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఓ లెటర్ కూడా రాశారు. దీని వెనుక బిజెపి ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉన్నట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి. శశికళ ఏమాత్రం యాక్టివ్ అయినా… అన్నాడీఎంకే దెబ్బతినడం… డిఎంకె అధికారానికి రావడం ఖాయమన్న సంకేతాలు ఢిల్లీ వరకు అందాయట. దీంతో… ఆరునూరైనా… డిఎంకెను అధికారానికి కిలోమీటరు దూరంలో ఉంచాలని డిసైడ్ అయిన బిజెపి అగ్రనేతలు… చిన్నమ్మకు ఓ చిన్నసైజు వార్నింగ్ ఇచ్చారట. దీంతో.. చిన్నమ్మ సైలెంట్ అయ్యారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే డిఎంకే విజయం సాధించడంతో శశికళ లేకపోవడం వల్లనే పార్టీ ఓడిపోయిందన్న మాట తమిళనాట ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. అన్నా డిఎంకెకు మళ్లీ జనం పట్టం కట్టాలంటే శశికళ నాయకత్వం అవసరమన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏమైనా శశికళ రాజకీయంగా పావులు కదపడంలో దిట్ట. అడుగు తీసి అడుగేసినా దాని వెనుక ఏదో ఒక స్కెచ్ ఉంటుందంటాయి తమిళ రాజకీయ వర్గాలు. ఏమైనా చిన్నమ్మ తమిళనాట రాజకీయాల్లో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారనేది ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News