తమిళనాడు ప్రభుత్వానికి ఆర్ముగస్వామి కమిషన్ సూచన
చెన్నై : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్ 5 న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆర్ముగస్వామి కమిషన్‌ని ఏర్పాటు చేయగా, ఐదేళ్ల తరువాత కమిషన్ 600 పేజీల నివేదికను ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సమర్పించింది. ఆ నివేదికతోపాటు అదనంగా సమర్పించిన 200 పేజీల్లో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆ కమిషన్ తన ముగింపు వ్యాఖ్యలలో జయలలిత నెచ్చెలి, స్నేహితురాలు శశికళను దోషిగా పేర్కొంటూ విచారణకు ఆదేశించాలని పేర్కొంది. ఇందులో డాక్టర్ శివకుమార్ (జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువు) , మాజీ ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, మాజీ ఆరోగ్య మంత్రి సి. విజయభాస్కర్‌లను కూడా దోషులుగా చేరుస్తూ దర్యాప్తునకు అభ్యర్థించింది.
అంతేకాదు కమిషన్ వివిధ కోణాలను పరిగణన లోకి తీసుకుంటే వారందర్నీ దోషులుగా గుర్తించి దర్యాప్తు చేస్తేగానీ ఒక నిర్ధారణకు రావడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పైగా జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా కమిషన్ తప్పుపట్టింది. 2016 డిసెంబర్ 4 మధ్యాహ్నం 3.50 గంటలకు జయలలిత గుండెపోటుకు గురైన తరువాత సీపీఆర్, స్టెర్నోటమీ వంటి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే నిందితులు దీన్ని సాకుగా చూపిస్తూ అధికారికంగా ప్రకటించడానికి జాప్యం చేసినట్టు చెబుతున్నారని కమిషన్ ఆరోపిస్తోంది. ఆమె 2016 డిసెంబర్ 4న చనిపోగా, ఆస్పత్రి వర్గాలు డిసెంబర్ 5న ప్రకటించడాన్ని కమిషన్ తప్పు పట్టింది. అలాగే జస్టిస్ అరుణ జగదీశన్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ 2018లో రాష్ట్రం లోని తూత్తుకూడిలో జరిగిన పోలీస్ కాల్పుల సంఘటనలో పోలీసుల తీరును తప్పు పట్టింది. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018 తూత్తుకూడి ఘటన లకు సంబంధించిన విచారణ నివేదికలను మంగళవారం అసెంబ్లీకి సమర్పించింది.