లక్నో : ఎనిమిది సార్లు ఎమ్‌ఎల్‌ఎగా ఎన్నికవుతూ వస్తున్న బిజెపి ఎమ్‌ఎల్‌ఎ సతీష్ మహానా మంగళవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్, అసెంబ్లీలో విపక్ష నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఈ ఎన్నికను ప్రశంసించారు. శాసనసభ సజావుగా సాగేలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. స్పీకర్ స్థానంలో మహానా కూర్చున్న తరువాత ఆదిత్యనాధ్ మాట్లాడుతూ పాలక, విపక్ష వర్గాలు రెండూ ఒకే దిశగా ముందుకు సాగడం రాష్ట్రానికి రెండు చక్రాల ప్రజాస్వామ్యంగా మంచి సంకేతమని అభివర్ణించారు. ఎన్నికలు ముగిశాయి, ఇక మనందరి విధి ఉత్తరప్రదేశ్ పురోగతిని కాంక్షించడమేనని శాసన సభ్యులకు సీఎం విజ్ఞప్తి చేశారు. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక కావడంతో ఆరోగ్యకరమైన సంప్రదాయం ప్రారంభమైందని శ్లాఘించారు. స్పీకర్‌గా తటస్థంగా వ్యవహరించి విపక్ష సభ్యుల హక్కులను కాపాడాలని కోరారు. మొదట తాత్కాలిక స్పీకర్ రమాపతి శాస్త్రి స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించారు.