Monday, December 23, 2024

ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రాంకి రెడ్డిచిరాగ్ శెట్టి జోడీ ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత జోడీ 2115, 2422 తేడాతో చైనాకు చెందిన లియాంగ్‌వాంగ్ చాంగ్ జంటను ఓడించింది. ఆరంభం నుంచే భారత జంట దూకుడుగా ఆడింది. సమన్వయంతో ఆడుతూ లక్షం దిశగా సాగింది. చూడచక్కని షాట్లతో చైనా జంటను హడలెత్తించింది. భారత జోడీ దూకుడుగా ఆడడంతో చైనా జంట ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన భారత జోడీ తొలి సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం భారత జంటకు ప్రత్యర్థి జోడీ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చైనా జోడీ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించింది.

ఇటు సాత్విక్ జంట అటు చైనా జోడీ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డింది. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఒక దశలో చైనా జోడీ ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది. కానీ కీలక సమయంలో సాత్విక్ జంట మళ్లీ పుంజుకుంది. ప్రత్యర్థి జంట జోరుకు బ్రేక్ వేస్తూ ముందుకు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. కాగా, చిరాగ్‌సాత్విక్ జోడీకి ఈ ఏడాదిలో నాలుగో ఫైనల్ పోరు కావడం విశేషం. ఇంతకుముందు స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్, ఇండోనేషియా ఓపెన్‌లో భారత జోడీ ఫైనల్‌కు చేరుకుని టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా సాత్విక్ జంట కొరియా ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరి మరో టైటిల్‌పై కన్నేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన అల్ఫియాన్‌అర్‌డియాంటో జంటతో తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News