మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య సిఎం రేవంత్ బృందం భేటీ
క్లౌడ్ కంప్యూటింగ్, ఓపెన్ ఎఐలో ఉచిత
క్రెడిట్స్, స్కిల్ వర్శిటీలో భాగస్వామ్యం,
ఫ్యూచర్ సిటీ ప్రాతిపదనలపై చర్చ
ఎఐ సిటీలో ఆర్‌అండ్‌డి సెంటర్
ఏర్పాటుకు ముందుకు రావాలని వినతి
డేటా సెంటర్ల ఏర్పాటుపై సమాలోచనలు
అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ
భాగస్వామిగా ఉంటాం
నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై సిఎం
రేవంత్ దార్శనికత భేష్: సత్య నాదెళ్ల
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని, ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సిఎం కోరారు. సోమవారం మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సత్యనాదేళ్ల నివాసంలో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలపై వారిద్దరూ చర్చించారు. ఏఐ సిటీలో ఆర్ అండ్ డి ఏర్పాటుకు సహకారం, క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై సత్యనాదెళ్లతో సిఎం చర్చించారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనున్న 6 డేటా డేటా సెంటర్లకు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
రంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లు ఏర్పాటు చేయనుండగా అందుకోసం మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందనవెల్లిలో 52 ఎకరాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఒక్కో డేటా కేంద్రం 100 మెగావాట్ల ఐటీలోడ్ ఉండనుంది. ఈ సెంటర్ల పనులు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తయితే డేటా సెక్యురిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో అగ్రస్థానానికి హైదరాబాద్ చేరుకోబోతుంది. అయితే సిఎం హోదాలో రేవంత్ తొలిసారి మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదేళ్ల భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటాం: సత్య నాదెళ్ల
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలన్న నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు. నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెంచినందుకు సత్య నాదేళ్లకు సిఎం కృతజ్ఞతలు
హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్య నాదెళ్లకు తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల (ఎంవి) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపివేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, జనరల్ ఏఐ, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు.
రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.