కెసిఆర్ పాలనలోనే గిరిజనుల వికాసం..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన వేసిన మంత్రులు సత్యవతిరాథోడ్, మల్లారెడ్డి…
హైదరాబాద్ : గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో రూ.4 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న బాలికల గురుకుల పాఠశాల భవనానికి మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతేడాది 2 కోట్ల 20 లక్షల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పుడు బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపనతో పాటు మంత్రి మల్లారెడ్డి అడిగినట్లు బంజారాభవన్‌కు కోటిన్నర రూపాయలు, ఆశ్రమ పాఠశాల భవనానికి రూ.3 కోట్లు, ఈ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన 8 గ్రామ పంచాయతీల భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజన ఆవాసాలకు లింకు రోడ్ల కోసం 1000 కోట్ల రూపాయలు, గిరిజన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 1700 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి చెప్పారు. వీటితో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ 7 తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల ఆరోగ్య పెంపు కోసం తొమ్మిది జిల్లాలో న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వేయి గురుకులాలను బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేయడం అంటే విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో గురుకులాలతో పాటు 340 ఆశ్రమ పాఠశాలలు, 1400 కు పైగా గిరిజన ప్రాంతాల్లోని పంచాయతీ పాఠశాలలను నడుపుతూ గిరిజనుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు జరుగుతోందన్నారు.
ప్రత్యేకంగా గిరిజనుల కోసం సైనిక్ స్కూల్, లా కోర్సు, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఫైన్ ఆర్ట్ కోర్సులు, ఆదిమ జాతి గిరిజన తెగల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ విద్యాలయాలు నిర్వహిస్తున్నామన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఐఎఎస్ స్టడీ సర్కిల్ పెట్టి సివిల్స్ కోసం, గ్రూప్స్ కోసం, అదేవిధంగా నీట్,జేఈఈ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇస్తుందన్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 20 లక్షల రూపాయలను అందజేస్తున్నామని వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి మంచి మనస్సు, డబ్బు రెండు ఉన్నాయి. ఏ పని చేసినా నిజాయితీతో చేస్తారు. అందువల్ల విద్యా సంస్థల అధిపతిగా, రాజకీయాల్లో ఎంపిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా విజయవంతం అవుతున్నారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఓనర్ కమ్ డ్రైవర్ పథకం కింద 60 శాతం సబ్సిడితో కార్లు ఇచ్చే పథకం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.