Saturday, November 23, 2024

ఆరోగ్యలక్ష్మీపాలు, మొబైల్ యాప్‌ల ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Satyavathi Rathod launches Arogya Lakshmi milk and mobile app

అంగన్‌వాడీ సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్

మనతెలంగాణ/ హైదరాబాద్ : అంగన్‌వాడీ సిబ్బంది సేవలకు ఏడేళ్లలో మూడుసార్లు గౌరవవేతనం పెంచాం.. త్వరలో ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు ఇచ్చేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో సోమవారం ఆరోగ్యలక్ష్మీ పాలు, ఆరోగ్యలక్ష్మీమొబైల్ యాప్‌ను మహిళా సహకార, అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఆకుల లలిత, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్‌తో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టవ్యాప్తంగా అంగన్‌వాడి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆరోగ్యానికి పాలను, అంగన్‌వాడి సేవలను పటిష్టం చేసేందుకు ఆరోగ్యలక్ష్మీమొబైల్ యాప్‌ను ఆవిష్కరించుకున్నామన్నారు.

గర్భిణీలు, తల్లులకు ఇచ్చే పాల ప్యాకెట్లును ఆరోగ్యలక్ష్మీపేరుతో ముద్రించి పంపిణీ చేస్తున్నాం. కమిషనర్ దివ్య లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా సమర్థవంతంగా పనులు నిర్వహిస్తున్నారు. దేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే అంగన్‌వాడీ కేంద్రాలలో పాలు అందజేస్తున్నారు. సిఎం కెసిఆర్ మంచి మనస్సుతో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలో లబ్దిదారులు పెరగడంతో 25 లక్షల మందికి అంగన్‌వాడీల ద్వారా ఇంటింటికి రేషన్ అందజేశాం. మనం చేసిన సేవలను గుర్తించి, కేంద్రం అవార్డు అందజేసిందన్నారు. అంగన్‌వాడీ అందిస్తున్న సేవలకు గాను ఏడేళ్ళలో మూడుసార్లు గౌరవ వేతనం పెంచారు, 30 శాతం పిఆర్‌సి ఇచ్చారు. ప్రతి నెల వేతనాలు అందజేస్తున్నాం. త్వరలో ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు ఇచ్చేలా కృషి చేస్తాం. అంగన్‌వాడీ సిబ్బంది విధుల్లో మనసు పెట్టి నిజాయితీగా పని చేయడమే కోరుకుంటున్నాని మంత్రి వెల్లడించారు.

మహిళల ఉపాధికి కొత్త కోర్సులు: ఆకుల లలిత, మహిళా సహకార, అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు బాగా పనిచేస్తున్నాయి. సిబ్బంది సేవలను గుర్తించి నిజామాబాద్ జిల్లాలో వారికి సన్మానం చేశాం. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో మహిళా ప్రాంగణాలు ఉన్నాయి. వాటిని విస్తరించడం, మహిళకు మరింత ఉపాధి కల్పించే కొత్త కోర్సులు పెట్టాలనే ఆలోచన చేస్తున్నాం.

యాప్‌తో పారదర్శకత : దివ్య దేవరాజన్, కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి

ఆరోగ్యలక్ష్మీపథకంలో భాగంగా నూతన పాల పాకెట్ల విడుదల చేయడం మంచి పరిణామం. మార్కెట్లో అమ్మే ప్యాకెట్స్‌కు మన ప్యాకెట్స్‌కు స్పష్టమైన తేడా కనిపించే విధంగా.. అంగన్‌వాడీ పాల పాకెట్స్ గుర్తించే విధంగా డిజైన్ చేశాం. ప్రభుత్వం ఇచ్చే పాలను లబ్ధిదారులకు అందజేయడమే దీని ఉద్దేశ్యం. ఆరోగ్యలక్ష్మీమొబైల్ యాప్‌తో అంగన్‌వాడీలు నిర్వహించే 14 రిజిస్టర్ల బాధ తప్పుతుంది. లబ్దిదారులు, సరుకులు, హాజరు విషయంలో సంపూర్ణ పారదర్శకత వస్తుంది. పనిలో వేగంతో పాటు లబ్ధిదారులకు సకాలంలో అందుతాయి. కార్యక్రమంలో ఉన్నతాధికారులు లక్ష్మీ, సునంద, కార్పొరేషన్ సంయుక్త సంచాలకులు సబిత, టిఎస్ ఫుడ్స్ ఉన్నతాధికారులు విజయలక్ష్మీ, కృష్ణవేణి, శ్రీనివాస్‌నాయక్, వివిధ జిల్లాల సంక్షేమ అధికారులు, ఎన్‌ఐసి రాష్ట్ర హెడ్ రాజశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News