కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు
అడిగేవారికి అవగాహన లేకపోతే…చెప్పేవారికి బాధ్యత లేకుండా పోయింది
అంగన్ వాడీల కోసం కేంద్రం 10 శాతం ఇస్తే…రాష్ట్రం 90 శాతం భరిస్తోంది
దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీలకు వేతనాలు తెలంగాణలోనే ఉన్నాయి
మహిళలు, పిల్లల సంక్షేమం చూసేవారిని వర్కర్లు అనొద్దు…టీచర్లు అని గౌరవించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ
తెలంగాణ పథకాలు బాగున్నాయని ప్రశింసిస్తూ…పార్లమెంట్ లో రాజకీయం చేస్తోంది బిజెపి మంత్రులు
పార్లమెంటును పక్కదోవ పట్టించి, పచ్చి అబద్దాలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలి
మంత్రి సత్యవతిరాథోడ్, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవి
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీదేవిలు విమర్శించారు. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ… తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్రం ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమలు ఇస్తున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించడం లేదని చెప్పడంపై వారు తీవ్రంగా ఆక్షేపించారు. ఆమె వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఒక బాధ్యత గల మంత్రిగా కొనసాగుతూ…పచ్చి అబద్దాలు చెప్పడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
ఆదివారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై భగ్గుమన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఆమె మాట్లాడారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న గోధుమలు అంగన్ వాడీ కేంద్రాల్లో లబ్దిదారులకు ఇవ్వడం లేదన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. రాష్ట్రంలో గోధుమలు ఎప్పుడు కూడా లబ్దిదారులకు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూడా ఇవ్వడం లేదని… కేంద్రం ఇచ్చిన గోధుమలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం చక్కెర, నూనె, పాల పౌడర్, పప్పు ధాన్యాలను అదనంగా కలిపి తయారు చేసిన బాలమృతం మాత్రమే ఇస్తున్నామని వారు స్పష్టం చేశారు.
దీనిపై కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానాన్ని చూస్తుంటే….కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ప్రశ్నలు, జవాబులు చూస్తుంటే కాంగ్రెస్, బిజెపిలు ముందే అవగాహనకు వచ్చి మాట్లాడుకుంటున్నారా? లేదా అడిగేవారికి, చెప్పేవారికి సబ్జెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయని అన్నారు పైగా ఫోర్టిఫైడ్ బియ్యం, గోధుమల విషయంలో అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని విచారిస్తాం అని కేంద్రమంత్రి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మహిళల సంక్షేమం గురించిగానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పథకాల గురించిగానీ… కోవిడ్ బాధిత మహిళల గురించి గానీ ఏనాడు మాట్లాడింది లేదన్నారు.
రాష్ట్రంలో 1975 నుంచి ఐసిడిఎస్ కొనసాగుతోందని…. ఆనాటి నుంచి నేటి వరకు కేంద్రం వద్ద ఒక విధానం అంటూ లేదన్నారు. అంగన్ వాడీలో టీచరును ఎలా తీసుకోవాలి? ఎంత వేతనం ఇవ్వాలి? విరమణ ఎలా చెయ్యాలి? అనే విధానమే కేంద్రానికి లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వీరికి విరమణ పెట్టామన్నారు. త్వరలో సంపూర్ణ విధానం తీసుకు వస్తున్నామన్నారు. తల్లి, బిడ్డలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పి, వారి సంక్షేమాన్ని సంపూర్ణంగా పట్టించుకుని తల్లివలె చూసుకుంటున్న అంగన్ వాడిలను వర్కర్లు అనొద్దు అని, టీచరుగా పిలుస్తూ వారిని గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని వ్యాఖ్యానించారు..
జాతీయ పోషకాహార సంస్థ(నిన్), ఇక్రిసాట్ సంస్థల పర్యవేక్షణలో మహిళలు, పిల్లలకు అదనపు పోషకాహారం అందించే బాలమృతం తయారు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. తెలంగాణ మహిళా, శిశుసంక్షేమ శాఖ అమలు చేస్తున్న గ్రోత్ మానిటరింగ్ పథకం చాలా బాగుందని..దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలుమార్లు స్వయంగా తాము ఢిల్లీకి వెళ్లినప్పుడు మెచ్చుకున్నారన్నారు.
గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహార లోపం ఉందని ఒక సర్వేలో తేలితే…దానిని అధిగమించేందుకు ఫోర్టిఫైడ్ బియ్యం అందించాలని కేంద్రం చెప్పిందన్నారు.. వారు చెప్పిన దానికి జాతీయ పోషకాహార సంస్థ, ఇక్రిశాట్ సంస్థలతో కలిసి నాణ్యమైన పోషకాహార ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసి తెలంగాణలో అంగన్ వాడీకేంద్రాల ద్వారా ఇస్తున్నామన్నారు. దీంతో పాటు మిల్లెట్స్ కూడా అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో చాలామంది మహిళల్లో రక్త హీనత ఉన్నదని, వారికి అదనపు పోషకాహారం ఇవ్వాలని అడిగితే కేవలం రెండు జిల్లాలకు మాత్రమే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. సిఎం కెసిఆర్ దీనిపై స్పందించి…. పోషకాహారం గురుంచి కేంద్రాన్ని అడగడం దేనికి? మనమే ఇద్దామని చెప్పి 9 జిల్లాలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ కింద ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
‘ఫోర్టిఫైడ్ బియ్యం గత నాలుగు నెలల నుంచి అందిస్తున్నామని…. పార్లమెంట్‌లో ప్రశ్న అడిగిన వారికి, అక్కడ సమాధానం చెప్పిన వారికి కూడా చెబుతున్నామన్నారు. పార్లమెంటును పక్క దోవ పట్టించి 24 లక్షల మంది గర్భిణీలు, పిల్లలను అనుమానపర్చి, ఆందోళన చేసే విధంగా స్మృతి ఇరానీ మాట్లాడడం తగదన్నారు.అంగ్‌వాడీల గౌరవ వేతనం కోసం కేంద్రం వాటాగా రూ. 2700లు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.10,950లు కలిపి దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ. 13,650 రూపాయల గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. వారి వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని, బాలామృతం తయారీలో గోధుమలు మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ చక్కెర, నూనె, పాలపౌడర్, ఇతర సామగ్రి అంతా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్నారు. ఇకనైనా కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ట్రం గురించి సంపూర్ణంగా తెలుసుకుని అడిగిన సభ్యులకు సమాధానమిస్తే బాగుంటుందని వారు సూచించారు. ప్రశ్న అడిగే సభ్యుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం బదనామ్ చేయాలనే ఆలోచనతో కాకుండా సంపూర్ణ అవగాహతో అడిగితే బాగుంటుందన్నారు.
Satyavathi Rathod slams Union Ministers over Paddy