హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అవసరమైతే హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లోని చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల్లో నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని, విద్యుత్ వైర్లు తెగి పడిపోయి నట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలు శిథిలావస్థ భవనాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిస్థితి మెరుగు పడేవరకు చెరువుల, వాగుల వద్ద చేపలు పట్టడానికి, స్నానాలకు అనుమతించవద్దని మంత్రి ఆదేశించారు.
భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రజలను తరలించేందుకు సమీపంలో క్యాంపులు ఏర్పాటు చేసేందుకు వీలుగా సంసిద్దంగా ఉండాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా సేవలు నిలిపి వేయాలని, రాకపోకలు నియంత్రణకు పటిష్ట బారికేడింగ్, ప్రమాదహెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి వెళ్లొద్దని మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు.