వచ్చే నెలలో పొడు భూముల పట్టాల పంపిణీ
నెలాఖరులోగా వెరిఫికేషన్, సర్వేలు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న పోడు భూముల పట్టాలను డిసెంబర్‌లో లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం బిఆర్‌కె భవన్‌లో పోడు భూములపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, అటవీ శాఖల అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో పోడు భూముల సర్వే పూర్తి చేసి పట్టాలను సిద్దం చేసి ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు. పోడు భూముల వెరిఫికేషన్, సర్వేలను నెలాఖరులోగా పూర్తి చేయడానికి గ్రామ సభలను నిర్వహించి తీర్మానం కాపీలను డివిజన్, జిల్లా స్థాయి కమిటీలకు వెంటనే పంపాలని కోరారు. విజ్ఞాపనల వెరిఫికేషన్, సర్వేలను వెంటనే పూర్తి చేయడానికి అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లెయిములు అందాయని, ఇప్పటికి అధిక శాతం క్లెయిముల వెరిఫికేషన్ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగొద్దని మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో అడవులను సంరక్షించాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమని అందుకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. పోడు భూములకు సంబంధించి మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను ఒక టీమ్ వర్క్‌తో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ సిఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సిసిఎఫ్ దొబ్రియల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Satyavathi Rathod video conference on podu lands distribution