రియాద్ : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అరబ్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు ఏర్పర్చుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్ పడినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని, ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసినట్టు సమాచారం.
గత కొన్నాళ్లుగా అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఇజ్రాయెల్ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 1979 లో ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో యాఏఈ , బహ్రెయిన్ దేశాలు ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితా లోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ఆరంభించింది. యుద్ధానికి ప్రారంభానికి కొద్ది రోజులు ముందు ఇజ్రాయెల్ సౌదీ అరేబియా దేశాలు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చాయి.
ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. సరిగ్గా ఈ ప్రయత్నమే… గాజా ఇజ్రాయెల్ మధ్య తాజా యుద్ధానికి కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అరబ్ లీగ్‌లో బలమైన దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా… ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పర్చుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇతర దేశాలూ సౌదీబాట పట్టే అవకాశం ఉంది. సాధారణంగా పాలస్తీనా సమస్య … అరబ్ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరినే అవలంబిస్తూ వచ్చాయి.
ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. అలాంటి దేశాలు యూదు దేశంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందడుగు పడడం కష్టమని అందరూ ఊహించినట్టుగానే సౌదీ వెనక్కు తగ్గడం గమనార్హం.