అహ్మదాబాద్: ప్రతిష్టాత్మకమైన విజయ్‌హజారే వన్డే ట్రోఫీని సౌరాష్ట్ర సొంతం చేసుకుంది. శుక్రవారం ఇక్కడి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి శతకంతో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రుతురాజ్ 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు.
మిగతావారిలో అజీమ్ కాజీ (37), నౌశాద్ షేక్ 31 (నాటౌట్) మాత్రమే రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హార్విక్ దేశాయ్, షెల్డన్ జాక్సన్‌లు జట్టుకు శుభారంభం అందించారు. దేశాయ్ ఏడు ఫోర్లతో 50 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 125 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జాక్సన్ ఐదు సిక్స్‌లు, 12 ఫోర్లతో అజేయంగా 133 పరుగులు సాధించాడు. చిరాగ్ జాని 30 (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. దీంతో సౌరాష్ట్ర అలవోక విజయాన్ని అందుకుంది.