మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ
నిలకడగానే ఆరోగ్యం, రెండో స్టెంట్ అమర్చే అవకాశం
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బుధవారం గంగూలీని కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించారు. ఛాతి నొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు గంగూలీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితమే తీవ్రమైన గుండెనొప్పి రావడంతో గంగూలీకి శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. పూర్తిగా కోలుకున్న గంగూలీని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. ఆ తర్వాత గంగూలీ యథావిథిగా బోర్డుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ఇదిలావుండగా బుధవారం గంగూలీ మళ్లీ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటినా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక గంగూలీని పరీక్షించిన వైద్యులు ప్రమాదం ఏదీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక గురువారం గంగూలీకి రెండో యాంజీయోప్లాస్టి చేసే అవకాశం ఉంది.
అయితే వైద్యుల నుంచి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంతకుముందు ఒకసారి గంగూలీకి యాంజీయోప్లాస్టి చికిత్స చేసి స్టెంట్ అమర్చారు. కాగా, గంగూలీకి బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. దీంతో అప్పట్లో అమర్చకుండానే అలాగే ఉంచిన రెండో స్టెంట్‌ను గురువారం అమర్చే అవకాశాలున్నాయి. ఇదిలావుండగా గంగూలీ మరోసారి ఆసుపత్రిలో చేరడంతో అతని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దాదా త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక టీమిండియా క్రికెటర్లు, అతని మాజీ సహచరులు, రాజకీయ ప్రతినిధులు తదితరులు గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Saurav Ganguly Admitted to Hospital Again