బెళగావి: కర్నాటకలోని బెళగావి సువర్ణ విధాన సౌధలోని అసెంబ్లీ హాలులో సోమవారం హిందూ జాతీయవాది వి.డి. సావర్కర్ సహా ఏడుగురి నిలువెత్తు చిత్రపటాలను ఆవిష్కరించారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరితో కలిసి ఆవిష్కరించారు. కాంగ్రెస్ తాము ఎంచుకున్న వ్యక్తుల జాబితాను అక్కడ అమర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేసింది.
కర్నాటక అసెంబ్లీ హాలులో ఇప్పుడు స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, బి.ఆర్.అంబేద్కర్‌ల చిత్రపటాలు స్పీకర్ కుడివైపున ఉన్నాయి. కాగా స్పీకర్ సీట్ వెనుక బసవన్న చిత్రపటం ఉంది. ఇక మహాత్మా గాంధీ, వల్లభభాయ్ పటేల్, వి.డి. సావర్కర్ చిత్రపటాలు స్పీకర్ ఎడమవైపు ఉన్నాయి. ఏడు చిత్రపటాలు…హిందుత్వ(వివేకానంద, సావర్కర్), జాతీయవాదం(బోస్, పటేల్), సామాజిక న్యాయం(బసవన్న, అంబేద్కర్) సందేశాలు ఇస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా బసవన్నను కర్నాటకలోని లింగాయత్‌లు కొలుస్తారు. వారు బిజెపికి పెద్ద మద్దతుదారులు. ఆ చిత్రపటాలను కాంగ్రెస్ వ్యతిరేకించదని బిజెపి గట్టి విశ్వాసంతో ఉంది. ముఖ్యంగా సావర్కర్ చిత్రపటాన్ని వ్యతిరేకించదని భావిస్తోంది. బెల్గావిలోని మరాఠి మాట్లాడేవారికి సావర్కర్ ఓ దిగ్గజం. ప్రస్తుతం శీతాకాల శాసనసభ సమావేశాలు బెల్గావిలోనే జరుగుతున్నాయి. ఇదిలావుండగా పటేల్ చిత్రపటానికి చోటిచ్చి, ప్రథమ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి చోటు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నిరసన ప్రదర్శించింది.