Sunday, December 22, 2024

గాంధీజీ స్థానంలో సావర్కర్?

- Advertisement -
- Advertisement -

వినాయక్ దామోదర్ సావర్కర్ చరిత్ర అంతా చీకటి చరిత్ర. విష చరిత్ర, కుట్రలు కుతంత్రాల చరిత్ర. అతను స్వాతంత్య్ర పోరాటాన్ని అడ్డుకొని బ్రిటిషు వారికి సహకరించిన వాడు. పైగా సెల్యులార్ జైలులో ఉన్నప్పుడు బ్రిటీషు ప్రభుత్వానికి ఎనిమిది సార్లు వినతి పత్రాలు సమర్పించి క్షమాపణలు కోరిన వ్యక్తి. అంతకు ముందు అతను బ్రిటన్‌లో ఉండగా ఒక రేప్ కేసులో దొరికిపోయి, తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించిన వాడు. ఇలాంటి వాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెడతారా? ఆ ఆలోచనే సిగ్గు పడాల్సిందిగా వుంది. ఆనాటి హిందువుల్ని ముఖ్యంగా ఆర్య బ్రాహ్మణుల్ని ఏకం చేయడానికి, ఇతర మతస్థుల మీద, ఇతర కులస్థుల మీద విషం చిమ్మిన వ్యక్తి సావర్కర్! దేశంలో కేవలం ఆర్య బ్రాహ్మణులు మాత్రమే ఉండాలని తాపత్రయ పడినవాడు.

శత్రువులు బ్రిటిషు వారు కాదు, అంతర్గత శత్రువులు దేశంలోనే వున్నారని ప్రకటించినవాడు. ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, బౌద్ధులు, జైనులు వంటి ఇతర మతస్థుల్ని చంపేయాలని తన అనుచరులకు పిలుపు నిచ్చినవాడు. వారి ఇండ్లలోని తల్లులు, భార్యలు, అక్కా చెల్లెళ్ళు ఎవరైనా సరే గర్భిణులు వుంటే, వారి పొట్టల్ని చీల్చి, పుట్టబోయే పిల్లల్ని చంపేయాలని పిలుపు ఇచ్చిన ‘మహనీయుడు’ ఈ విషయాలన్నీ సావర్కర్ పర్సనల్ అసిస్టెంట్ (పి.ఎ) లిబయ రాస్తే బయటికొచ్చినవే! అందువల్ల సావర్కర్‌ను విమర్శించడం నేరం కాదు, ప్రతి భారతీయుడి హక్కు. ఏ ప్రభుత్వమూ, ఏ సంస్థా ఇవ్వకపోయినా తనకు తానే ‘వీర్’ అనే పదం తన పేరుకు ముందు తగిలించుకొని ‘వీర్ సావర్కర్’గా ప్రాచుర్యం పొందిన నీచ ప్రవృత్తిగల వాడు సావర్కర్.

తొలి దశలో దేశభక్తుడిగా నటించినా, తర్వాత కొంత కాలానికే అతని అనైతికత ఈ దేశ ప్రజలకు అర్థమైంది. అంతేకాదు, ఆనాటి బ్రిటిషు ప్రభుత్వానికి ఇంకా బాగా అర్థమైంది. అందుకే జైలు పాలయ్యాడు. బయటికి వచ్చి గాడ్సేను తయారు చేసి, ప్రోత్సహించి, గాంధీ హత్యకు దోహదం చేశాడు. ఇలాంటి వాణ్ణి గాంధీజీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జాతిపిత స్థానాన్ని ఒక దేశ ద్రోహికి అంటగట్టాలని చూస్తోంది. అందువల్ల దేశ ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ఎక్కడికక్కడి కుతంత్రాల్ని బట్టబయలు చేయాలి. ఆధునిక భారతీయ చరిత్రలో నీచాతి నీచుడుగా మిగిలిపోయిన వాడు ఎవరూ? అంటే దేశ ప్రజలంతా ఏకకంఠంతో ‘సావర్కర్’ అని నినదించాల్సిన అవసరం వుంది. అందుకు అతనికి అన్ని అర్హతలూ వున్నాయి. ఈ విషయాలన్నీ చాలా మంది చెప్పినవే. మరీ ముఖ్యంగా ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి సావర్కర్ నైతికతను దుయ్యబడుతూ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోలో మాట్లాడారు. ఆనాటి విషయాలు నేటి తరానికి అందించాలన్న తపన కొద్దీ ఆయన మాట్లాడారు. విషయ పరిజ్ఞానం వున్న ఆ న్యాయమూర్తి జస్టిస్ కె. పాటిల్‌ను ఈ దేశ ప్రజలు నమ్ముతారు.

ఇటీవల గుజరాత్ ఎన్నికల ర్యాలీలలో తిరుగుతూ, తన స్థాయి మరిచి ప్రతి గల్లీ తిరుగుతూ మాట్లాడారు భారత ప్రధాని ఆ సందర్భంలో ఆవును గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. “గోవు గురించి మాట్లాడడం ఏమైనా అపరాధమా? పవిత్రమైన గోమాత గురించి ఎవరైనా మాట్లాడొచ్చు” అని అన్నారాయన. అయితే ఆయన తెలుసుకోవాల్సిన విషయాలు మరి కొన్ని వున్నాయి. 1930లలో కూడా ఇప్పటి వలెనే గోవును గూర్చి చర్చలు జరిగాయి. ఆ రోజుల్లో మహారాష్ట్రలో ‘భాలా’ పేరుతో ఒక పత్రిక వెలువడేది. అందులో ‘ప్రశ్నోత్తరాల’ శీర్షిక ఒకటి నడిచేది. అందులో ఒకసారి ఒక ప్రశ్న వచ్చింది. “నిజమైన హిందువు ఎవరూ?” అని! “ఎవరైతే గోవును పూజిస్తారో, సంరక్షిస్తారో వారే నిజమైన హిందువులు” అని కొంత మంది జవాబు రాశారు. అవన్నీ చదివి సావర్కర్ సుదీర్ఘమైన లేఖ రాశాడు.

ఆ తర్వాత ఒక పుస్తకమే రాశాడు. దాని పేరు “విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్‌”. ఆ పుస్తకాన్ని స్వాతంత్య్ర వీర్ సావర్కర్ స్మారక సమితి ప్రచురించింది. సావర్కర్ ఆలోచనల్ని ఈ దేశ ప్రజలు చాలా నిశితంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఆ “దేశ ద్రోహ దేశ భక్తుడు” నేటి మోడీ యోగిల జోడికి ఆరాధ్యుడు. వారి దృష్టిలో మహా నాయకుడు. ఒక దశలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం సావర్కర్ పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పటి నాయకులు ఆయనను నెత్తి కెక్కించుకొని, జాతిపిత స్థానాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అది అయ్యే పని కాదు. దేశ ప్రజలు చేతులు ముడుచుకొని ఏమీ కూర్చోరు.

సావర్కర్ ఎంతటి దేశ ద్రోహానికి తలపడ్డా, తన పుస్తకం “విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్‌”లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. వాటిని ప్రభుత్వ పెద్దలు శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ చదువుకోవడం అవసరం. ఎందుకంటే ఆ రాసిన వాడు వారి దృష్టిలో మహా నాయకుడు గనక. సావర్కర్ తన పుస్తకంలో ఇలా రాశాడు ‘ఎవరైతే గోవును పూజిస్తారో వారు మానవ జాతి స్థాయి నుండి కిందికి దిగజారిన వారవుతారు.. ఇంకా గోవు ఒక జంతువని, దానికి లేని పవిత్రతను ఆపాదించి పూజించడం అంటే అది మూర్ఖత్వమవుతుందనీ’ స్పష్టంగా రాశాడు వినాయక్ దామోదర్ సావర్కర్! ‘ఆవు ఎంతటి నికృష్టపు జంతువంటే, అది తన మలంలోనే అది పొర్లుతుంటుంది. దానికి బుద్ధీ, జ్ఞానం వుండవు గనకనే తను వేసిన పేడలో అది బొర్లు తుంటుంది’ అని కూడా రాశాడు. ఇది కాక, సావర్కర్ మరొక ముఖ్యమైన విషయం వెలుగులోకి తెచ్చాడు.

‘మొఘలులు లేక ఇతర విదేశీయులు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు, వారిని ఎదిరించి యుద్ధం చేయకుండా హిందువులు గోవులను పూజిస్తూ కూర్చున్నారనీ, దాని మహిమతో విజయం తమనే వరిస్తుందన్న భ్రమలో వుండిపోయారనీ, అదెంతో సిగ్గు చేటనీ రాశాడు సావర్కర్! సైనికులు, పౌరులూ అందరూ గోపూజ చేస్తూ కూర్చున్నందు వల్ల యుద్ధం చేయగల ధైర్యం, నైపుణ్యం పోగొట్టుకున్నారని, యుద్ధ కౌశలం పోగొట్టుకున్నాక విజయాలెలా సాధిస్తారని ఒక రకంగా ఈ దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకోవడానికి కారణం నిస్సందేహంగా గోవే!’ అని సావర్కర్ విశ్లేషించారు. దుర్గం, ఖిల్లా, కోట ఏదైనా సరే రక్షించుకోవడం ఈ “గో పూజారుల” వల్ల కాలేదు అని తీర్మానించాడు. ‘ఒకవేళ సైనికులకు యుద్ధ సమయంలో ఆహారం కొరత ఏర్పడితే, గోవుల్ని కోసుకొని తినాల్సింది. అలా చేసైనా తమ తమ రాజ్యాల్ని తాము కాపాడుకోవాల్సింది’ అన్నది సావర్కర్ అభిప్రాయం!

“గోపాలన్ హవే గో పూజన్ నభే” (మరాఠీ శీర్షిక) గోవుల పాలన అవసరమే కాని, గో పూజ వద్దు అనేది ఆ మరాఠీ శీర్షికకు అర్థం. ఈ శీర్షికతో సావర్కర్ ఏమి చెప్పారంటే గోవు పాలిస్తుంది గనుక, మనుషులు దాన్ని పోషించుకోవాలి. కాని వాటిని పూజించడం ఎందుకూ? అన్నది ఆయన ప్రశ్న! ఆయన లాగే గోవుల్ని పూజించడం ఎందుకూ? అని ఈ దేశ ప్రజల్లో కొందరు అనుకుంటే అది పొరపాటు కాదు. తప్పిదం కాదు. గోవుకు ఏ పవిత్రతా లేదు అంటే అది నేరమూ కాదు, ఈ విషయం నేటి ప్రధాని అతని అనుచర గణం కూడా అర్థం చేసుకోవాల్సి వుంది. ఈ దేశంలో శ్వేత విప్లవం కురియన్ నేతృత్వంలో గతంలో జరిగింది. పాల ఉత్పత్తిలో ఈ దేశం చాలా ముందుంది. ఇందులో ఇప్పటి ప్రభుత్వ పెద్దల కృషి ఏమీ లేదు. వీరు అధికారంలోకి రాక ముందే ఆ పని జరిగిపోయింది. ఇకపోతే గో మాంసం ఎగుమతులు ఎవరు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిందే. బిజెపి పెద్ద నాయకులే కదా ఆ పని చేస్తున్నదీ? వీరిలో ముస్లింలు లేరు. అల్ కబీర్ అల్ దువా (అంటూ ఉరుదూ పేరు పెట్టుకొని హిందువులే గో మాంసం ఎగుమతి చేస్తున్నారు.

ఈ విషయంలో ప్రపంచంలోనే మన దేశం మొదటి రెండు స్థానాల్లో వుంది. ప్రపంచ స్థాయి గోమాంస విక్రేతల్లో మొదటి 20 మంది హిందువులేనన్నది అధికారంలో వున్న వారు కావాలనే చెప్పరు. ఆ పని ముస్లింలు చేస్తున్నారనే భ్రమను దేశప్రజలకు కలిగిస్తారు. ‘చాలా తక్కువ ధరకు గో మాంసం అందిస్తామని’ ఇదే బిజెపి నేతలు ఎన్నికల సందర్భంలో గోవా ఓటర్లకు హామీలిస్తారు! అది కూడా పక్కన గల కర్నాటక నుండి తెప్పిస్తామంటారు. కర్నాటకలో ఎవరి ప్రభుత్వం వుందో మనకు తెలుసు. 17 జనవరి 1948న చివరి సారి సావర్కర్‌ను దర్శించుకోవడానికి నాథూరామ్ గాడ్సే, ఆప్టే, బాడ్గే, శంకర్‌లు వెళ్ళారు. నాథూరాం, ఆప్టేలు లోపలికి వెళ్ళారు. మిగిలిన ఇద్దరు బయట కాపలా కాశారు. సావర్కర్‌ను కలిసి నాథూరాం, ఆప్టేలు బయటికి రాగానే ఆప్టే, బాడ్గేతో ఓ మాట చెప్పాడు.

“యశస్విహో ఉన్యా” విజయుడవై తిరిగి రమ్మని సావర్కర్ నాథూరామ్‌ను దీవించారని గాంధీకి నూరేళ్ళు పూర్తయ్యాయనీ అనుకున్న ప్రకారం పథకం పూర్తవుతుందని సావర్కర్ ఆశగా వున్నాడన్న విషయం ఆప్టే బయట వున్న సహచరులకి చెప్పాడు. గాంధీజీ హత్య కేసులో సరైన ఆధారాలు దొరకక శిక్ష పడలేదు కానీ, ఒక రకంగా సావర్కర్ నిత్యనూతన క్రిమినల్. అతని పేరు ముందు ‘వీర్’ అని రాయడం, పలకడం పెద్ద తప్పిదం అవుతుంది. ఒక్కోసారి దేశభక్తుడిగా, హేతువాదిగా కనిపించినా, ఎక్కువ శాతం దేశ ద్రోహిగా, హిందూ మత ఛాందసుడిగా అనిపిస్తాడు. ఆ దేశ ప్రజలు సావర్కర్ నుండి ఏం నేర్చుకోవాలి? ఏ విషయంలో అతను ఆదర్శప్రాయుడవుతాడు? విశ్లేషించుకొంటున్న ఈ దేశ ప్రజలు, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న నాయకుల నిర్ణయాల్ని అసహ్యించుకుంటున్నారు.

సావర్కర్‌కు వీరు ఇస్తున్న ప్రాముఖ్యాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. చంద్రనాథ్ బసు అనే అతను ‘హిందుత్వ’ అనే పదాన్ని రూపొందిస్తే, దాన్ని విరివిగా వాడుకొని, ప్రాచుర్యంలోకి తెచ్చిన వాడు సావర్కర్. ఒక దశలో సిక్కులు పంజాబ్‌ను సిక్కిస్థాన్‌గా చేసుకోవాలని, అందుకు తను సహకరిస్తాననీ అన్నాడు. పాకిస్తాన్, సిక్కిస్తాన్‌లు విడిపోతే, ఇక హిందూ రాష్ట్ర (హిందుస్థాన్) మిగులుతుందని కలలుగన్నాడు. ఒకనాడు ఒక క్రిమినల్ కన్న కలల్ని నేటి ఈ కేంద్ర ప్రభుత్వం నిజం చేయాలనుకొంటోంది. దేశంలో అదే ‘హిందుత్వ’ సెంటిమెంట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చి… ఎలాగైనా దొడ్డి దారిన మళ్ళీ మళ్ళీ గెలవాలన్నదే వీరి ప్రయత్నం! ఉపాధి, అభివృద్ధి, ధరల తగ్గింపు వంటి వాటి గురించి వీరు ఏ మాత్రమూ మాట్లాడరు. ఆవు మూత్రం, ఆవు పేడల దగ్గర ఆగిపోయిన ఈ దేశ నాయకుల మెదళ్ళు బహుశా వాటితోనే నింపుకున్నారేమో! అందుకే ఇతర అంశాల గూర్చి మాట్లాడలేక పోతున్నారేమో! అని నేటి యువతరం అనుకుంటూ వుంది. ఏమైనా, ఈ దేశ ప్రజలు నాయకులను అనుసరించకుండా, స్వతంత్రంగా ఆలోచించడం అన్ని విధాలా మంచిది.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News