టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి పిలుపు
ఉత్సాహంగా ఎనర్జీ వాక్-2022 ప్రారంభం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు విద్యుత్‌ను ఇంధనాన్ని పొదుపు చేయాలని తెలంగాణ స్టేట్ రెనెవేబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( టిఎస్ రెడ్కో ) ఛైర్మన్ వై.సతీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలోని ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నిర్వహించిన ఎనర్జీ వాక్ 2022 ను టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆదివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఖైరతాబాద్ లోని ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ భవనం దగ్గర ప్రారంభమైన వాక్.. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైవర్ నుంచి తిరిగి ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ భవనం వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ… పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించాలలని ఇందుకోసం ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోని ఆయన కోరారు. డబ్బులను మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో.. విద్యుత్ ను ఇంధనాన్ని కూడా అంతే జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఇళ్లలో అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడకూడదని.. అవసరం లేనప్పుడు వాటిని ఆపేసి ఇంధన పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఇంధన వాడకం పెరిగిపోయి.. ప్రపంచం కాలుష్యమయం అయిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుని.. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని బహుమతిగా ఇవ్వాలని సూచించారు.
ఇంధన పరిరక్షణ, కాలుష్య రహిత పర్యావరణం కోసం రెడ్కో చేపడుతున్నా కార్యక్రమాలను వివరించారు. విద్యుత్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎల్‌ఈడీ లైట్లు, బిఎల్‌డిసి ఫ్యాన్లు బిగిస్తున్నామని చెప్పారు. అలాగే సోలార్ విద్యుత్ ను, ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కాగా ఈ ఎనర్జీ వాక్ లో పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఎన్‌సిసి కేడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ బ్రహ్మరెడ్డి, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఛైర్మన్ శ్రీనివాసాచారి, ఇంజినీర్స్ ఇనిస్టిట్యూట్ సభ్యులు, పలు కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.