హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాలన్నారు. నిమ్స్ లో వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని చెప్పారు. బెడ్ ఆక్యుపెన్సి రేటు 100 శాతానికి పెంచాలని, పీడియాట్రిక్ పాలియేటివ్ సేవల్లో మనం దేశం దేశానికి ఆదర్శంగా ఉందని ప్రశంసించారు. అడల్ట్ పాలియేటివ్ కేర్ సేవలను అద్భుతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు హరీష్ రావు సూచించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని సలహాలు ఇచ్చారు.
తెలంగాణలో టీచింగ్ ఆసుపత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యమవుతుందన్నారు. సాధారణంగా బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ నుంచి కార్నియా, గుండె, కాలేయం, లంగ్స్, కిడ్నీలు సేకరించాలని, జీవన్ దాన్ లో రిజిస్టర్ అయి ఏళ్ల కాలం నుండి ఎదురు చూస్తున్న వారికి అవయవ మార్పిడి చేసి ప్రాణం కాపాడవచ్చని హరీష్ రావు తెలిపారు. వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్ని విధాల సహకారం అందిస్తున్నారని, కాబట్టి అందరం బాగా కృషి చేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు.