పనాజి: గోవా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రధాని మోడీ, ఇతర అతిరధ మహారధుల సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోడీతోపాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే కేబినెట్ మంత్రులు ఎంతమంది సోమవారం ప్రమాణం చేస్తారో అధికార పార్టీ బిజెపి ఇంతవరకు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రులు కేబినెట్‌లో ఉండవచ్చని చెబుతున్నారు. రాజ్‌భవన్‌లో కాకుండా బయట ప్రమాణస్వీకారం జరుగుతుండడం ఇది రెండోసారి. పదివేల కన్నా ఎక్కువ మంది స్టేడియంకు ప్రేక్షకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 29 నుంచి గోవా అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు జరుగుతాయని గవర్నర్ పిఎస్ శ్రీధరన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సావంత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి ఉందని అధికారులు తెలిపారు.