Sunday, January 19, 2025

రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఎస్‌బిఐ స్పష్టత.. ప్రూఫ్ అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రూ.2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించినప్పటినుంచి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకులో ఫారాన్ని నింపాల్సి ఉంటుందన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదయినా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. అయితే వీటిపై దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) స్పష్టత ఇచ్చింది. రూ.2000 నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రాన్ని నింపాల్సిన అవసరం లేదని ఎస్‌బిఐ స్పష్టంచేసింది.

రూ.20 వేల వరకు నేరుగా బ్యాంకులో మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే ఎలాంటి ఐడి ప్రూఫ్‌ను సమర్పించాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది. నోట్ల మార్పిడి సమయంలో రిక్విజిషన్ ఫారం నింపాల్సి ఉంటుందని, దానికి ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు ప్రూఫ్‌గా జత చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో మెస్సేజిలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బిఐ తాజాగా ఈ స్పష్టత ఇచ్చింది.ఈ మేరకు అన్ని బ్యాంకు శాఖలకు ఎస్‌బిఐ చీఫ్ జనరల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు నోట్ల మార్పిడి ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయేందుకు వీలుగా జనానికి అన్నిరకాల సహకారాన్ని అందించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో బ్యాంకు స్థానిక హెడ్ ఆఫీసులను కోరారు.

కాగా రూ.2000 వేల నోట్లను మార్చుకోవడానికి ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా క్యూలో నిలబడవచ్చని కూడా బ్యాంకు వర్గాలు తెలిపాయి. నోట్ల మార్పిడి సదుపాయం ఈ నెల 23నుంచి ప్రారంభం కానున్నప్పటికీ చాలా మంది కస్టమర్లు శనివారమే రూ.2000 నోట్లతో తమ బ్యాంకు శాఖలను సందర్శించడం కనిపించింది. అలాంటి వారిని బ్యాంకు అధికారులు నోట్ల మార్పిడి తేదీ గురించి తెలియజేసి వెనక్కి పంపించారు. మరికొందరు తమ వద్దనున్న రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడానికి శనివారం క్యాష్ డిపాజిట్ మిషన్లను ఉపయోగించుకోవడం కూడా కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News