ముంబై: బ్యాంకు ఖాతాదారులకు ఎస్‌బీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ ఆర్) రుణాల్ని 10బీపీఎస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సవరించిన ఈఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నేటి నుంచి రుణాలు తీసుకున్న వారు, లేదంటే తీసుకునే ప్రయత్నాల్లో ఉన్న వారికి మరింత అదనపు భారం పడనుంది.
ఎంసీఎల్‌ఆర్ అంటే
ఎంసీఎల్‌ఆర్‌ను మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అని చెప్పొచ్చు. ఈ ఎంసీఎల్‌ఆర్‌ను వాడుక భాషలో సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. వివిధ బ్యాంకుల్లో (బ్యాంకును బట్టి మారతాయ్) ఏదైనా లోన్ తీసుకోవాలంటే.. ఆ లోన్‌లపై మినిమం ఇంత మొత్తంలో వడ్డీ కట్టాల్సి ఉంటుంది. లోన్‌లతో పాటు, టెన్యూర్‌ను బట్టి లోన్లపై బ్యాంకులు వడ్డీని విధిస్తాయి. ఈ విధానాన్ని ఆర్బీఐ 2016లో అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఎంసీఎల్‌ఆర్‌ను ఆధారంగా హోం లోన్, పర్సనల్ కార్ లోన్లపై ఇంట్రస్ట్ రేట్లు తగ్గు తుంటాయి, పెరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఇదే ఎంసీఎల్‌ఆర్‌పై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. జూలై15 (నేటి) నుంచి ఈ కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి.