న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జమ్మూకాశ్మీర్ ని రెండుగా విభజించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్ , సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది.
సుప్రీంలో జరిగిన వాదనలపై తాము సంతృప్తితో ఉన్నామని పిటిషన్ దాఖలు చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మసూది అన్నారు. ఆగస్ట్ 2న విచారణ ప్రారంభమై 16 రోజుల పాటు ఈ కేసుపై ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి. పిటిషనర్ల తరుపున కపిల్ సిబల్, జఫర్ షా, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ థావన్, దుష్యంత్ దవే, దినేష్ ద్వివేది సహా సీనియర్ న్యాయవాదులు తమ వాదల్ని వినిపించారు. భారత ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా, అదనపు సోలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ వాదనల్ని వినిపించారు.