న్యూఢిల్లీ: ప్రభుత్వం 2016లో చేసిన రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయంకు వ్యతిరేకంగా చేపట్టిన విచారణను సుప్రీంకోర్టు నేడు నవంబర్ 24కు వాయిదా వేసింది. సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోరడంతో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రధాన న్యాయాధిపతి ఎస్.ఏ.నజీర్ విచారణను వాయిదా వేశారు. సమగ్ర అఫిడవిట్‌ను రూపొందించనందుకు వెంకటరమణి న్యాయమూర్తులు బిఆర్. గవాయ్, ఏఎస్ బొపన్న, వి. రామసుబ్రమణ్యన్, బివి. నాగరత్నలతో కూడిని ధర్మాసనానినిక క్షమాపణ కోరారు. అఫిడవిట్ దాఖలు చేయడానికి ఓ వారం రోజుల సమయం ఇవ్వాల్సిందిగా కూడా కోరారు.
పిటిషనర్ వివేక్ నారాయణ్ శర్మ తరఫు సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదన వినిపిస్తూ రాజ్యాంగ ధర్మాసనాన్ని వాయిదావేయాలని కోరడం అసాధారణం అన్నారు. మరో పక్షం సీనియర్ అడ్వొకేట్ పి.చిదంబరం ‘ఇది ఓ ఇబ్బందికర పరిస్థితి” అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి నాగరత్న సైతం ‘సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని వాయిదావేయమనడం ఇబ్బందికరమైనదే’ అని అభిప్రాయపడ్డారు.
అఫిడవిట్‌ను దాఖలు చేయడానికి కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం వారం రోజుల సమయాన్ని ఇచ్చింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన 58 పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. ‘వాయిదా కోరడంతో ఆదిలోనే హంసపాదు’ అన్నట్లు తయారయింది.
నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటు అంశాన్ని, దానికి సంబంధించిన ఇతర విషయాలను ప్రధాన న్యాయమూర్తి టిఎస్. ఠాకుర్ నేతృత్వంలోని ధర్మాసనం 2016 డిసెంబర్ 16న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేశారు.