న్యూఢిల్లీ: గత ఏడాది మసీదు సముదాయం(కాంప్లెక్స్)లో దొరికిన శివలింగాన్ని శాస్త్రీయంగా సర్వే చేయడానికి అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు నిర్వహణ కమిటీ చేసిన అప్పీల్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు పి.ఎస్. నరసింహ, జెబి పార్ధివాలా కూడా ఉన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, తీర్పు రిజర్వ్‌లో ఉందని, కార్బన్ డేటింగ్ కోసం దరఖాస్తు చేశామని, దీనిని హైకోర్టు అనుమతించిందని న్యాయవాది తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఈ నెల ప్రారంభంలో, అలహాబాద్ హైకోర్టు జ్ఞాన్‌వాపి మసీదులోని ‘శివలింగం’ కాలాన్ని నిర్ధారించడానికి ‘శాస్త్రీయ సర్వే’ నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ)ని ఆదేశించింది.
సర్వే సందర్భంగా నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఎఎస్‌ఐని హైకోర్టు కోరింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్ స్పందించింది. ఎఎస్‌ఐ తన నివేదికను సీలు చేసిన కవరులో సమర్పించింది.