న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ సవరణపై పిటిషన్‌ను వినడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఎలక్టోరల్ బాండ్ అనేది ఓ ప్రామిసరీ నోట్ లేక బేరర్ బాండ్ వంటిది. దానిని దేశంలోని ఏ వ్యక్తి, కంపెనీ, సంస్థ లేక సంఘాలు కొనవచ్చు. ఎలక్టోరల్ బాండ్లనేవి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు జారీ చేయబడుతుంటాయి. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 7న ఆ పథకంను సవరిస్తూ ప్రకటన జారీచేసింది. అదనంగా మరో 15 రోజుల పాటు అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. అది కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాధారణ ఎన్నికలు జరుగాల్సిన సంవత్సరంలో.
ఎలక్టోరల్ బాండ్ ప్రకటన పూర్తిగా అక్రమం అంటూ సీనియర్ అడ్వకేట్ అనూప్ జార్జ్ చౌదరి సుప్రీకోర్టుకు తన వినతిలో తెలుపుకున్నారు. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ప్రభుత్వం 2018లో తెచ్చింది. ఇప్పటికే సవరణలను చాలెంజ్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఫైనాన్స్ యాక్ట్ 2017, ఫైనాన్స్ యాక్ట్ 2016 ద్వారా అపరిమిత, చెక్‌చేయని నిధులు రాజకీయ పార్టీలకు అందేలా చట్టాలు తెచ్చారు. ఫైనాన్స్ బిల్ 2017 ద్వారా ఎలక్టోరల్ బాండ్ పథకానికి తెరతీశారని, పైగా దానిని మనీ బిల్ కింద ఆమోదించారని, నిజానికి అది మనీ బిల్ కాదని ప్రభుత్వేతర సంస్థలు , అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ అండ్ కామన్ కాజ్ పేర్కొన్నాయి.