ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు వైద్య సీట్ల కోటా కొనసాగింపు
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నీట్‌లో ఉత్తీర్ణులైన ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 50 శాతం సూపర్ స్పెషాలిటీ కోర్సు సీట్లు కేటాయిస్తూ తాము గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సూపర్ స్పెషాలిటీ కోరుల్లో ఇన్ సర్వీస్ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడానికి జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. 2020 నవంబర్ 27న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో 2020-2021 విద్యా సంవత్సరానికి ప్రసాదించిన మధ్యంతర రక్షణను కొనసాగించాలని, దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ విద్యా సంవత్సరం కౌన్సెలింగ్ కొనసాగించే స్వేచ్ఛ తమిళనాడుకు ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను గురువారం నుంచి ప్రారంభమయ్యే హోలీ సెలవుల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది.